Viveka Panchakm anu Jeevitha Rahashyam
Chapters
స్వప్నతత్త్వవివేకము స్వప్న ప్రయోజనము -కల- దాని ప్రభావము స్వప్నయాధార్థ్య స్థితి=అనగా కలయొక్కనైజ భావము ఇది. ఈశ్వర స్థాపిత సర్వశాస్త్ర కళాశాలవిద్యా ప్రణాళిక, స్వప్న విచారణ - సంధ్యోపాసనము - సమానములు. మానవుడు పగటి కలమునందు, వ్యవసాయమును గాని, వర్తకమునుగాని, ఉద్యోగమును గాని, కూలి నాలి గాని యొనర్చి అలసి, సొలసి, విశ్రమించిన అవయవముల విశ్రాంతికి గాను, రేయి పరుండును, నిదురించునపుడు మధ్య కాలమున, తాను, అరణ్యమునకు పోయినట్లును అచట బెబ్బులి కాన వచ్చినట్లును, ఆ పులి తనను తరుముకొని వచ్చుచున్నట్లును, తాను దాని బారినుంచి తప్పించుకొనుటకు గాను పరుగులిడుచున్నట్లును, మహాభయముతో గడ గడ వణకుచున్నట్లును, ఇతరు లెవరేని అట నున్నచో నను రక్షింపుడను కేక లిడుచుచును, ఒక వృక్షము నధిరోహించుచున్నట్లును దిగ చెమటలు పోయుచున్నట్లును, తో(కాం)చెను. ఇంతలో ఉలికిపడి కనువిప్పి చూడగా మువ్వన్నెమెకము కానరాదయ్యెను. అడవి లేదు. తాను మంచము పైనున్న పఱపుపై పవ్వళించి యుండెను. అపుడతడీ యవస్థను ''స్వప్న''మనును. దాని ( ఆ యవస్థ)లో ఏమి కానవచ్చెను? ఏమి జరిగినది? పులి కానవచ్చెను. దానింగాంచి భయ పడి పరుగెత్తెను. ఆ విషయము నిదురించుచున్న స్వప్నస్థుడగు పురుషున (జీపున)కే తెలియను. ప్రక్కనున్న భార్యకు గాని, బంధువులకు గాని ఏ మాత్రము తెలియదు. కాని కనుతెరచి చూసినపుడు పులి కానరాదు. ఇది ప్రక్కయే కాని అరణ్యము కాదు. కాన భయకంపాదులు తొలగినవి. ఇది స్వప్నము (కల) కాని పులి లేదని తలంచి స్వస్థుడగును. ఈ స్వప్నమున చూచిన వస్తువు (పులి మున్నగునవి) కను విప్పినచో, కాన రాలేదు. కాన స్వప్నము వట్టిది. హుళక్కి, దబ్బర, అబద్ధము, మిధ్య; అవాత్మ, కల - కల్లయని నిశ్చయించుకొనును. కనుమూసి, నిద్రానుభనము పొందు సమయమున, నిద్రలో స్వప్నము కలిగి అందు అడవి య, పులియు, కానవచ్చి భీతి కలిగి గడ గడ వణకెను. అపుడది నిజమనియే తలంచెను. ఇది అజ్ఞానావస్థయనియు, కను తెఱచి, చూచినందున ఐహిక ప్రపంచజ్ఞానము (జాగ్రదవస్థ) కలుగుటచే, పులి కావచ్చుటయు, అరణ్యమున సంచరించుటయు దుబ్బరమని తెలిసి కొనగలిగెను. స్వప్నము (కలుగక) లేక అనగా కలను గనక, గాఢముగా నిద్రించెను, నిద్రనుంచి కొంతవడికి లేచి (మేల్కాంచి) అహా! ఎంత సుఖముగా నిద్రించితిని. నల్లులు కుట్టిన ను, చీములు కఱచినను, దోమలు బాధి చినను, జెఱ్ఱులు నాపైప్రాకినను, ఇతరులు అఱచినను, ''నా కేమియు తెలియదు. నేనేమి నెఱగను.'' అనును. ఆ నిద్రలో కేవలం సుఖమును మాత్రమే అనుభవించెను. ఎవరు అనుభవించెను? తానే, అనగా ఆ సుషుప్త్యవస్థను పొందినవాడని భావము. అపుడా సుఖాను భవమును సుషుప్త్యవస్థయందు చెప్ప గలిగెనా? లేదు - కారణమేమి? అపుడచట బహి రింద్రియములు లేవు. అంతరింద్రియములు లేవు. అనగా ఆ ఇంద్రియము లన్నియు తమ తమ కార్యము (పను) లను విరమించి, మనస్సు నందు లీనమైనది, మనస్సు ఆత్మయందు లీనమైనది. అపుడు చెప్పుటకు సాధనములగు నింద్రియములు లేవు. కాని ''హాయిగా నిద్రించితిని'' అను, అనుభవము మాత్రము కలదు. అది తక్క మరియేమియు నెఱుగడు. అనగా ఆ సుషుప్తి (గాఢ నిద్ర) యందు జాగ్రదవస్థలో నున్న స్థూల శరీరమునకు చెందిన అనుభవమును గాని, స్వప్నమున నున్న సూక్ష్మ శరీరమునకు చెందిన అనుభూతిని గాని, ఏమియు అనగా దేనిని ఎఱుగడని భావము. అచట ఆ గాఢ నిద్రావస్థయందు అనగా సుషుప్తి స్థితియందు నిత్యానుభవ రూపమైన స్వస్వరూపాను భూతిని అనుభవించెను. అనగా తాను సాక్షీచైతన్యమగుజీవుడు స్వస్వరూపమునందు లయించెనని భావము. అంతకు మించి నేనేమియు నెఱుగననెడి అనగా స్వప్నమునందు గాంచిన శార్దూలముగాని, విపినముగాని, భయకంపాది విషయములు గాని జాగ్రదవస్థయందలి, ఇల్లు , వాకిలి, తోట, దొడ్డి, పొలము, అలుబిడ్డలు, పశువులు, మున్నగు ఐహిక సంతోషములుగాని, మఱి ఏమియు కానరానందున, ఏమియు నెఱుగడని భావము. ఆ స్థితికి (ఆయవస్థకు) ''సుషుప్తి'' కేక 'గాఢనిద్ర'' అని పేరు. ఆ సుషుప్తి యందు తాను కారణ శరీరము, నేనేమియు నెఱుగననెడి అజ్ఞానము, (అవిద్య, నందు ఉండెనని ఎఱుగ వలయును. నేనేమియ నెఱుగను అనగా సుఖము తప్ప ఇంక నేవిధమగు దుఃఖమును ఎఱుగనని భావము. నేను సుఖస్వరూపుడనై యుంటినని తాత్కాలిక సుఖానుభూతిచే ఎఱింగెను. ఇది పొలము, ఇది తోట, ఇది ఇల్లు, ఇది నా ఇల్లాలు, ఇది నా సంతతి, ఇది నా ధనము, ఇది నా బంధువర్గము, అను వ్యవహారమును గుర్తించి, మెలకువ గలిగి మెలంగునప్పుడు గుర్తించును, ఆలు బిడ్డలను, బంధువర్గమును, భృత్యవర్గమును పిలచును. అట్లు పిలుచుటకు ఆ సమయమున బహిరింద్రియములు కలవు. అది ''జాగ్రదవస్థ''యని పేర్కొనబడును. మెలకువగ నున్నప్పుడు ఆ స్థితియే ''జాగ్రదవస్థ'' యనబడును. ఏమియు నెరుగని (తెలియని) స్థితి అనగా మెయిమ ఱ చి నిద్రించుట''సుషుప్త్యవస్థ'' యనబరగును, ఈ రెం డవస్థలకును నడుమ గల మధ్య కాలమున, శార్ధూలము, కాననము, కాన వచ్చెను. ఆ యవస్థయందు కంటితో పులిని చూచినట్లును, భయముతో రక్షణకై అరచినట్లును, అనుభవము జరిగినది కాని కనులు తెరచి కాంచినచో, పులియు, వనము, కాన రాలేదు గడా! పోని 1. అది మెలకువ గల జాగ్రదవస్థయందమా? కాదు. కారణమేమి? కాలు, చెయ్యి, ఎట్లు వేసినని అట్లే యుండును. కనులు మూతపడి ఱప్పలు చలనము లేకయే యుండెను. పులిని చూచి భయపడి చెట్టు ఎక్కినది ఎవరు? తానే (సాక్షీ చైతన్యము) అంత రింద్రియములతో చూచెను. భయపడెను. నోటితో అరచెను, పరుగిడెను, చెట్టు ఎక్కెను ఉలికిపడి, త్రుళ్ళి, నిద్రలేచి కన్ను తెరచి చూచినపుడు ఇంతకు పూర్వము జరిగిన దంతయును వట్టి దయ్యెను గదా! 2. అది గాఢ నిద్రకు చెందిన సుషుప్తి అదమా? కాదు గాదా! అపుడు మేను మఱచి నిద్రించలేదు, పులినిగాంచుటయు, భయమును చెందుటయు, పరుగునిడుటయు, వృక్షారోహణమొనర్చటయు, జరిగినవి. కాన అది సుషుప్తి - ''గాఢనిద్రం'' కాదు. పోని అది జాగ్రదవస్థయా? కాదు. లోగడ విమర్శించితిమి గదా! కను దెఱచినంతనే పులి కానుపించ లేదు. భయకంపాదులు కాన రాలేదు. గాఢ సుషుప్తియు, జాగ్రదవస్థయు కానిది. ఇట్టిస్థితి, ''స్వప్నావస్థ'' యనంబరగును. దీని వలన మనకేమి లాభము (ప్రయోజనము)? 3 అనగా ఈ స్వప్నమున చూచినది యథార్థము (నిజము)గ తోచినది కనువిప్పి చూచిన వట్టిదని తెలిసినది. అట్లే మెలకువగా నున్న జాగ్రదవస్థ యందు తాను చూచిన ఇల్లు, ఇల్లాలు, సంతానము, ధనము, బంధు వర్గము, తోటలు, భూములు, మున్నగు వ్యవహారమంతయును గూడ నంతియే. అనగా స్వప్న ప్రాయమే యను పాఠము=భావము=బోధ=ను తెలిసికొనుటయే ముఖ్య ఫలము=ప్రయోజనము. అనగా వ్యవహారములో జాగ్రదవస్థలో చూచినదియును కొంత కాలము కనుపించుచు, మన మనుభవించుచు, మరికొంత కాలమునకు లేకపోవుటయు, జరుగునని బోధపడును. స్వప్నమున యధార్థముగ (నిజముగ) చూచినదియు, సత్యమని తలచినదియు, నగు, పులి, అడవి, భయము, మున్నగునవి, కను తెఱచిన ఎట్లు లేకపోయి, అది యొట్లు నిజము కాలేదో, అట్లే జాగ్రదవస్థ యుదును, తాను చూచిన ఇల్లు ఇల్లాలు, సంతతి, తోట, దొడ్డి, ధనము, ధాన్యము, బంధుభృత్య వర్గయులు మున్నగు వ్యవహార మంతయు, సంసారము=జగము=అనాత్మ=మిధ్య=అవిద్య అంతయు యథార్థము కాదని తెలుపుటకును, మన మెఱుంగుటకును, ఏర్పఱుపబడినది. ఈ స్వస్నావస్థ=స్వప్న జగము, అని గ్రహింపదగియున్నది. స్వప్నమునందలి వృత్తాంతమును, అనుభవించినపుడు స్వప్నస్థుడగు పురుషుడు=జీవుడు అది నిజమనియే భావించును. ఆ స్వప్నస్థ పురుషు (జీపు) డే కన్ను తెఱచినపుడు అసత్యమని తెలిసి కొనగలుగుచుండెను. అట్లే జాగ్రదవస్థ యందును తాను అనుభవించిన విషయములన్నియు నిజమని తోచును. అది నిత్యము కానందున, సత్యము కాదు మఱియు సత్యము కానందున అది నిత్యమును కాదు. కనుక, కనువిప్పి, (తెఱచి) నపుడు అనగా వివేకమని యెడి, లేక జ్ఞాన మని యెడి, నేత్రమును లేక శాస్త్రమనియెడి లేక గురూపదేశ మనియెడి వెలుగు=జ్యోతి అనెడి మూడవ కన్నును తెఱచినపుడు ఈశ్వరాంశకలవాడవై జాగ్రదవస్థ యందలి వ్యవహార విషయమంతయును, పరమార్థ దృష్టియందు అసత్యమే=మిధ్యయే అని బోధయగును. ఆ బోధకొఱకే భగవానుడు ''కృష్ణం వందే జగద్గురుం'' అన్నట్లు జగద్గురువై, తండ్రి తన బిడ్డలకు జ్ఞానోదయమునకు గాను పాఠశాలలో ప్రవేశ##పెట్టి విద్యాబుద్ధుల గఱపించునట్లు, స్వప్న మనెడి అవస్థను పటముగాను (సినీమా ఫిలింగీలుగాను) ప్రదర్శించి తన శిష్య తుల్య (ప్రతిబి బరూప) జీవులకు స్వస్నావస్థను, తదనుభవమును కల్పించి జీవులము, శిష్యులము, అయిన మనకు మిధ్యయగు స్వస్నావస్థను కల్పించి, యథార్థమును బోధించు చుండెను. కాన సత్యవస్తు బోధ కొఱకే భగవానుడు, మనకు మిధ్యయగు స్వస్నావస్థ నేర్పఱచి, స్వప్నము వలె జాగ్రదవస్థయు మిధ్యమనియు, సుషుప్తివలె నిత్య సుఖ స్వరూపానంద స్థితిని పొందింపజేయుచు, స్వప్న రూప స్థితిని చేరుటకు ప్రతి దినము సుషుప్తియను పాఠశాలకు పంపుచు, మనకు బోధించు చుండెను. ఇదియే స్వప్న ప్రయోజనమని ముఖ్యముగ మనము గమనింప తగియున్నది. ఈశ్వర నిర్మిత సర్వశాస్త్ర కళాశాలా విద్యా ప్రణాళిక పగటి వేళ కూలియో, నాలియో, విద్యయో, చేసి కొనుచు జీవించు ప్రజలకు రాత్రి పాఠశాలలు నెలకొల్పి యువజన విద్యా కేంద్రములను స్థాపించి, వానియందు ''వ్యావహారికాక్షర (లిపి) జ్ఞానమును'' కలిగించుట ప్రభుత్వము నిర్వహించు చున్న పగిది, దైవ సామ్రాజ్యమున భగవానుడే జగద్గురువై రాత్రివేళ పగటి వ్యవహారమంతయు చక్క చేసి కొను తమ ప్రతి బింబములగు జీవులకు పారమార్థికాక్షర (నశించని స్వస్వరూప) జ్ఞానమును కలిగించుటకు స్వప్న పట ప్రదర్శన మొనరించుచు, సుషుప్తి యందు ప్రతి దినము స్వస్వరూపాను భవమును కలిగించుచు డెనని ఎరుంగతగును! ప్రతిదినము జీవులు సుషుప్తి కాలమున సన్నిధిని చేరుచుండును. ఆ అఖండానందానుభూతిని పరమాత్మ కొంత చవి చూచి వచ్చుచుందును ఇది స్వస్వరూపానుభూమి నార్జించునిత్య సత్యకళాశాల. ప్రభుత్వ పాఠశాలలకు, దసరా, సంక్రాంతి వేసవి, ఊడ్పులు, కోతలు, బుద్ధ - మహావీర - నానక్ - క్రీస్తు మహమ్మద్ మున్నగు మహాపురుషుల జన్మదినోత్సవములు, వర్ధంతి దినోత్సవములకును, పండుగలు, ఆదివారములు మున్నగు సెలవు దినములు నొసెంగెదరు. ఈ దైవసామ్రాజ్య నిర్మిత సర్వశాస్త్ర కళాశాలయను సుషుప్తి పాఠశాలకు మాత్రము, స్వస్వరూపాను సంధానమునకు ఏకాదశీ, శివరాత్రి, కార్తిక పూర్ణిమ మున్నగు భగవద్విషయక జాగరములు తప్ప, వ్యావహారికములగు అనధ్యయనములు, ఆటవిడుపు దినములు మున్నగు సెలవులను ఇవ్వకయే ప్రతి దినము నిద్రావస్థయందు స్వస్వరూపానుభూతిని, యీ సుషుప్తియను కళాశాలయందు జీవాళికి కల్పించి జీవోద్ధరణమునకు హేతుభూతమగు పరమార్థ జ్ఞానమును కలిగించు చుండెనని మనము విశ్వసింప వలయును. ప్రతీ దినము జీవుడు నిద్రావస్థయందు (రాత్రి పాఠశాల యందు) పరమాత్మయగు గురుని సన్నిధికి చేరి స్వస్వరూపానుభవమును, ఆనంద స్వరూపమును పొందుచు, నిత్యానుభవ శిక్షణమును, పొందు చుండెనని ఎరుంగ వలయును. ఆట విడపు దినమున బాలుడు చదువు మాని ఆటలాడునట్లు జీవుడు జాగ్రదవస్ధయందు ఆ విషయమును మరచినను, మరల సుషుప్త పాఠశాలలో నిత్యము నిత్యసుఖానుభవమును నేర్చుకొనుచుండునని గ్రహింప వలయును. శ్లో||సఏవమా యాపరిమోహితాత్మా శరీరమా స్థాయ కరోతి సర్వం స్త్ర్యన్న పానాది విచిత్రభోగై స్సఏవ జాగ్రత్పరితృప్తి మేతి|| శ్లో||స్వస్నేతు జీవస్సుఖ దుఃఖ భోక్తా స్వమాయయా కల్పిత విశ్వ (జీవ) లోకే సుషుప్తి కావేస కలే విలీనే తమో7భిభూత స్సుఖ దుఃఖ మేతి|| శ్లో||పునశ్చ జన్మాంతర కర్మయోగా త్స ఏవ జీవస్స్వపితి ప్రబుద్ధః పురత్రయే క్రీడతి యశ్చ జీవ స్తతస్తు జాతగ్‌ం సకలం విచిత్రమ్. ఆధార మానంద మఖండ బోధం యస్మిన్లయం యాతి పురత్రయంచ'' || ఇతికై వల్యోపనిషత్. దీని భావమే ఇచట చెప్పబడు చున్నది. జీవుడు మాయచే మిగుల మోహముతో నా ఇల్లు వాకిలి భార్యా బిడ్డలు తోటలు, దొడ్లు, అనుకొనుచు, చూచుచు, అనుభవించుచున్న జీవుడు= తెలివి=చైతన్యము వ్యావహారికముగా మెలకువతో నుండెనని తలంతుము. ఇది జాగ్రదవస్థ యనబడును. ఆకలి తీరుటకు వృద్యన్న పానాదులును, స్త్రీ భోగముతో మోహము తీరుటకును, శరీరధారియై దాని యదభిమానముతో, జాగ్రదవస్థలో తృప్తి నొందుచుండెను. ఇప్పుడు స్థూల శరీమున విశ్వుడను పేరుతో అక్ష పురుషుడు (దక్షిణ) నేత్ర స్థానమున నుండి ప్రకాశించును. అడవిని, పులినిచూచుట, భయపడుట, రక్షణకై కేక లిడుట, వృక్షము నధిరోహించుటయును, దుఃఖమును, మిత్రులు, పుత్రులు కాన వచ్చినపుడు సుభానందములను, తోన్నగు జాగ్రద్విషయ వాసనల ననుభవించు చున్నట్లు, ముచెడి నిద్రావస్థలోని స్వప్నమను స్థితిని పొంది అనుభవించుచు జీవుడు తైజసుడను నామమున, స్థూల శరీరమును విశ్వుడును పేరును వదలను, కంఠస్థానమున నుండి సూక్ష్మ (లింగ) శరీరమున వెలుగొందును. స్థూల శరీరమును వదలుట యనగా ఆ శరీరము మృతి నొంది నూతన శరీరమగు సూక్ష్మ శరీరమును ధరించి తైజసుడను నాఖ్యతో అంతర్యామిగా ప్రకాశించునని భావము. మఱికొంత సమయము గడువగా స్వప్న శరీరమగు సూక్ష్మ శరీరమును వదలి తైజసుడను పేరును గూడ విడచి, జీవుడు కారణ శరీరమున జన్మాంతర కర్మ యోగమున కారణ శరీరాభిమాని యగు ప్రాజ్ఞనామంబున ప్రకాశించుచు ఆకాశమగు హృదయ గుహా స్థానమున జాగ్రత్స్వప్నముల యందలి సర్వవిధ సుఖ దుఃఖ వాసనలను వదలి, నిశ్చింతగా వెలుగుచుండును. ఇపుడు జీవుడు సుషుప్త్యవస్థను జెంది, స్వప్న శరీరమగు సూక్ష్మ శరీరమును, తైజస నామమును విడచి, సుఖముగా నిద్రించును. ఈ సుషుప్తిలో సూక్ష్మ శరీరము పోయినది. అనగా మృతి నొందెను. కారణ శరీరస్థుడై తమస్సు (అవిద్య) తో గూడి సుషుప్తి యందు సుపుడగును. ఒడలు తెలియని నిద్ర ననుభవించును. పిమ్మట మఱికొంత సేపటికి, నిద్ర నుంచి ప్రబుద్ధుడగును. అనగా మెలకువ గలిగి సుషుప్త్యవస్థను, కారణ శరీరమును, ప్రాజ్ఞనామంబును వదలి స్థూల శరీరమున జాగ్రత్ర్పపంచమున విశ్వ నామముతో చైతన్యము = జీవుడు ప్రకాశించు చుండును. ఇపుడు కారణ శరీరము పోయినది. అనగా మృతి నొందినది అని భావము. ఇట్లు స్వప్నస్థునకు (జీవునకు) స్ధూల శరీరము పోయినది సుషుప్త్యవస్థయందు సుపుడగు జీవునకు సూక్ష్మ లింగ) శరీరము పోయినది. అనగా మృతమయ్యెను. జాగ్రదవస్థ యందలి జీవునకు కారణ శరీరము పోయినది. అనగా మృతి నొందెను. ఇట్లెల్లప్పుడును అనగా ప్రతి దినమునందు, ఏదో యొక్క శరీరమునమాత్రమే చైతన్యము ప్రకాశించు చుండును. తక్కిన రెండు శరీరములు నశించు చుండును. ఇట్లు ప్రతి దినము నందును మూడు పర్యాయములు శరీరములు మృతి నొందుచుండును. మూడు పర్యాయములు జనించు చుండును. ఎప్పుడు ఏదో ఒక శరీరము మాత్రమే ప్రకాశించు చుండును కాని శరీరము మృతి నొందినప్పుడు నాశరీరము పోయినదే యని జీవుడుగాని, ఆజీవునకు చెందిన బంధువులుగాని, ఎవరును, ఏఒక్కరును దుఃఖించుట లేదు. బహుమంది బంధువులుండియు, భార్యా పిల్లలుండియు దుఃఖించు వారొక రేని కానరారైరి. కారణమేమి? ప్రతి దినము నందు చచ్చు వానిని గురించి ఎవరు, ఎంతకాలము, ఎన్నిసార్లు విలపింపగలరు? కాన అట్లు చచ్చువానిని గుర్చి దుఃఖించు వారు కాన రారు. జనించు నపుడు సంతసించువారును కానరారు. మృతినొందినప్పుడు దుఃఖించు వారు ఉండబోరు. ఈ జనన మరణములు బంధువులకు గాని ఆలుబిడ్డలకుగాని ఇరుగు పొరుగు వారికి గాని తెలియదు తుదకు జీవునకు గూడ తెలియకుండును. ఎంతసేపు పిలచినను పలుకని, దీర్ఘనిద్రపోయి (మృతినొంది) నపుడు మాత్రము ఏడ్చువాడు బహుమంది చుట్టును చేరెదరు. చూడవత్తురు. కన్ను తెఱచిన సృష్టియంతయు ప్రకాశి చుచు కాన వచ్చును. ఇది క్షణసృష్టియగును. కనుమూసిన కానరాక మాయమగును. ఇది క్షణప్రలయము. అట్లే ఇది - దినసృష్టి - దినప్రలయము. అట్లే జగత్=లోక సృష్టి - జగత్ప్రలముయ. అట్లే బ్రహ్మసృష్టి - బ్రహ్మ ప్రలయము. అట్లే విష్ణుసృష్టి - విష్ణు ప్రలయము. అట్లే రుద్రసృష్టి - రుద్రప్రలయము. అట్లే యుగసృష్టి - యుగప్రలయము. మహాయుగసృష్టి - మహాయుగ ప్రలయం. ఇట్లే ఆయా కాలములందు ఆయా సృష్టులును ప్రలయములును జరుగు చుండును. ''నజాయతేమ్రియతేవా కదాచిత్'' భ.గీ. జీవుడు పుట్టువాడును కాడు. చచ్చువాడున కాడు. కాన నిజమునకు ఎవరును దుఃఖింపరు, దుఃఖింపనక్కరయులేదు అని భావము. జాగ్రదవస్థయందు స్థూల శరీరమునగల అవయవము లగు వాక్పాణి పాదపా యూపస్థలగు బాహ్యేంద్రియములతో పరిదృశ్యమానమగు వ్యావహారిక జగత్తును గాంచుచు, జీవుడు సుఖమును, దుఃఖమును, అనుభవించుండెను. స్వప్నావస్థయందు సూక్ష్మ శరీరమునగల త్వక్చక్షు శ్శోత్ర జిహ్వఘ్రాణములగు అంతరింద్రయములతో బాహ్య దేహవాసనల ననుసరించి, లోకలోకాంతర నివాస వాసనల ననుసరించి, విద్యావాసనల ననుసరించియు, స్వప్న ప్రపంచమున జీవుడు సుఖమునుగాని, కష్టమునుగాని, భయమునుగాని అనుభవించుచుండెను. జీవుడు జన్మాంత సత్కర్మ పరిపాకమున రాజు గానుండి, ఏదోయొక దుష్కర్మ పరిపాకమున భిక్షాటనము చేయు చున్నట్లు స్వప్నము గాంచును. కన్ను తెరచి చూచిన తాను హంస తూలికాతల్పమున రాజ దుస్తులతో నుండెను. భిక్షకుడుగ లేడు. కాన ఆ దృశ్యము ననుభవించి నపుడు సత్యముగా తోచినను, కన్ను తెరిచి వ్యవహారమున గాంచిన అది అసత్యమయినది. జీవుడు మరియొక పర్యాయము నిరు పేదగ నుండియు స్వప్నమున ఏనుగుపై నంబారీ యుత్సవమును పొందినట్లును, మంత్రులతో సలహాలను గైకొనుచు రాజ్యమును పాలించుచున్నట్లు గాంచెను, కన్ను తెఱచి చూచినపుడు తానొక చుట్టు గుడిసెలో చినిగి మాసిన వలువలతో చింపిరిచాపమీద పరుండియుండెను రాజు కాలేదు. స్వప్నమున అనుభవించించినపుడది సత్యముగా తోచెను. వ్యవహారమున ఆ విషయము జాగ్రదవస్థయందు అసత్యమయినది. కాని స్వప్నానుభవము జాగ్రదవస్థలో వట్టిదై అసత్య మయ్యెను. అట్లే జాగ్రదవస్థయందు సకల సుఖములనుభవించెను. తాను ఉండగానే భార్య మృతయైనది. ఆ భార్యవలన కలిగిన సుతుడు సుఖసంతోషముల గలిగించుచు నకస్మాత్తుగా దేహమును చాలించెను. దుఃఖమును కలిగించెను. భూములు, తోటలు సుఖమును గలిగించెను అప్పులవారి బాధ పడలేక వానిని వారి కప్పగించెను. అవియు పోయినవి. కాన జాగ్రదవస్థలోని విషయ సుఖములు గూడ నిత్యములు గాక అస్థిరములై అసత్యముగా తోచినందున జాగ్రదవస్థయును స్వప్నమువలె అసత్యములనియు, నస్థిరము లనియు స్పష్టపడుచు డేను స్వప్నము గంటయో రెండు గంటలో, మూడుగంటలో, అనుభవమునకు వచ్చెను. కన్ను తెఱచిన నవియు అనిత్యములై కానవచ్చెను. జాగ్రదవస్థలో అరువది వత్సరములో, నలుబది హాయనములో, ఎనుబది వర్షములో, డెబ్బది వసంతములో, సుఖముల ననుభవించెను. కాని స్వప్నమువలె నవియు నసత్యములుగా తోచుటచే జాగ్రదవస్థయు, దీర్ఘస్వప్నమువలె తోచుచుండెను. ఇక సుషుప్తిలో బహిరింద్రియములతో గాని, అంతరింద్రియమలుతో గాని, ఎట్టి నష్టకష్ట, ఐహిక దుఃఖములను అనుభవింపకయే గాఢముగా నిద్రించి సుఖమును మాత్రమే అనుభవించెను. కష్టము నష్టము, దుఃఖము, ఎట్టిదో ఎరుంగని సుఖానుభవము కలిగెను. ఇక సుషుప్తిలో ఆ సుఖమును చెప్పజాలకపోవుటకు కారణము ఆయవస్థలో ఇంద్రియములు లేవు. జాగ్రదవస్థలో నింద్రియము లుండుటచే ఆ సుషుప్తిలో తా ననుభవించిన సుఖమును చెప్పగలిగెను. అచట దుఃఖమే లేదు. అనుభవించిన సుఖము మాత్రం జీవునకు వాసనా మాత్రమున నుండెను. అందుచే ఇంద్రియ సంబంధముచే జాగ్రదవస్థలో చెప్పగలిగెను. సరే ఈ సుషుప్తిలోని సుఖము మాత్రము నాలుగు గంటల కాలమే అనుభవించెను. కాని పిమ్మట జాగ్రదవస్థకు చేరుకనప్పటికి ఈ గడ్డివామిపై పశువులు పడి మేయుచున్నవి. గడ్డి చెడును. పశువులను తోలుము లేక కట్టివేయుము. అదుగో కుక్కులు వంటకమును తాకు చున్నవి. అన్నమును తినుచున్నవి. వానిని పారతోలుము ఇంట నేయి అయిపోయినది. నూనెయు నిండుకున్నది. వానిని అంగడికిపోయి సేకరించు కొనవలయును - అనుసంసారిక దుఃఖములు వచ్చి చేరుతున్నవి. కావున ఆ సుషుప్తిలో సుఖానుభూతియు స్వల్ప కాలమే కాన వచ్చెను. నిత్యసుఖముగా కానరాదయ్యెను. కాన సుషుప్తిలోని సుఖము సత్యము నిత్యము కాదు శాశ్వతముగా తోచదయ్యెను సుషుప్తి సుఖ స్వరూపమును, దాని వైలక్షణ్యమును బోధించుటకు మాత్రమే ఉపయుక్తమైనదని తెలియనగును. కాన ఇదియు అనగా సుషుప్తిలోని సుఖానభవము గూడ స్వప్న సదృశ్యమేయని తోచెడిని. కాన జాగ్రత్స్వప్న సుషుప్తులు మూడు అవస్థలును, స్వప్న ప్రాయమే యని తోచుచుండెను. ఇదియే జననమరణ రూప సంసారమని గ్రహింపనోపు. శ్లో. సుస్తస్య్వప్నొ జాగరశ్చసో7యం సంసార ఈరితః స్వప్నస్సకాలఏవా స్తి నాన్యదాస్వప్నా జాగరౌ! తధైవేతి స్వప్న సామ్యాస్త్రయస్స్వప్నా ఉదీరితాః|| ఇతి అనుభూతి ప్రకాశికాయా ముక్తం. ఇక శాశ్వత సుఖమనెడి యైశ్వర్యుమెట్లు చేకూరును? సుషుప్తిలో తాననుభవించిన సుఖమును జాగ్రదవస్థలో నిరంతరం అనుభవింపచేయగలది అద్వితీయాఖండపూర్ణానందవారాశియగు బ్రహ్మానందసుఖము ఒక్కటియే. దానిని అభ్యాసవైరాగ్యములనియెడి గురువు=ఈశ్వర-వీరి అనుగ్రహములను సంపాదించి, శాశ్వతనిరతిశయ బ్రహ్మానందమును అనుభవింపవలసియున్నది. అనగా అభ్యాసరూపమగు వైరాగ్యముచే, నట్టి శాశ్వతానందమును సముపార్జింపవలయును. అప్పుడు శాశ్వత నిరతిశయ బ్రహ్మానందము ప్రాప్తించును. శ్లో. శివాశబ్దమయీ ప్రోక్తా| శంభుశ్చార్ధమయస్మృతః| అతః శబ్దార్థ నిష్పత్తి | సిద్ధయే తౌన తౌమయా|| ఇతి వాయుపురాణ. శబ్దము= మాట= పేరు- గౌరీస్వరూప మనియును, అర్థస్వరూపుడు శంకరుడు అనియువాయు పురాణము తెలుపుచున్నది. ఏనుగు అను శబ్దము ఒక వస్తువు లేక జంతువు పేరు. ఏనుగు అనువస్తు రూపము అర్థమును తెలుపును. ఏనుగు, సర్పము, గృహము, పదములు, వాని రూపములు అర్థస్వరూపము. కాన పదముల అర్థస్వరూపమే జగత్తు. జగత్తునకు మూలము పరమేశ్వర శక్తియగు మాయ=గౌరీ అని భావము. పదము అనగా సుబంతము గాన, తిఙంతము గాని పదమనబడును. ఆ పదమునకు అర్థమే పదార్థమగు వస్తురూపమగు జగత్తు. ''వ్యాక్యార్థజ్ఞానస్య పదార్థ జ్ఞానమావశక్యం'' అనిరి. వాక్యమునకు అర్థము తెలియవలయుననిన, పదములు అర్థము తెలియవలయును అనగా పదార్థ విజ్ఞానము వలననే వాకా ర్థ జ్ఞానము కలుగును- అని భావము. అహం, బ్రహ్మా అను పదార్థ జ్ఞానము వలన అహం బ్రహ్మ అనియెడు వాక్యార్థము తెలియును బ్రహ్మ పదార్థము అనుకొనుము బ్రహ్మయను శబ్దము ఒక పదము. దాని అర్థము పరిదృశ్యమానమగు జగద్రూపమున భాసించుచున్నది. ఈశ్వరానుగ్రహమున అద్వైత వాసన కలుగును. బ్రహ్మజ్ఞానము కలుగును. కాన బ్రహ్మయను పదమునకు అర్థము జగద్రూపభావమని భావము. కాన సర్వంబులు ఇదం బ్రహ్మ అంతయు బ్రహ్మరూపమని భావము. బ్రహ్మ పదము శక్తి స్వరూపము. బ్రహ్మపదమునకు అర్థము జగద్రూప భావము బ్రహ్మ-పద- అర్థము- అయి యున్నదని భావము. కాన జగత్తును బ్రహ్మ పద-అర్థమును తెలిసికొనుము. జగత్తును బ్రహ్మపదమునకు అర్థముగా గ్రహించుము. ఇదియే బ్రహ్మ విచారమని భావము, ఈ విచారణ వలన గలిగిన ఆనందమే బ్రహ్మానందమని భావము. శబ్దము=ధ్వని=పదము=బ్రహ్మము, దాని అర్థరూపమున వెలుంగు చున్నది జగత్తు. ''పశ్యేత్ బ్రహ్మమయం జగత్'' అని కలదుకనుక జగత్తును బ్రహ్మ-పద-అర్థమునుగా తెలిసికొనుటయే బ్రహ్మానంద ప్రాప్తియని తెలిసికొనుము. స్థూల సూక్ష్మకారణ శరీరములో, నుంచి ప్రకాశించు జీవుడు ఒక్కడే కాని వేరుకాడు. అట్లే జాగ్రత్స్వప్న సుషుప్తులనుండి అనుభవించు వాడును ఒక్కరుడే కాని అన్యుడు కానేరడు. అట్లే బాల్య¸°వన కౌమారు వార్ధకములందు ప్రకాశించు జీవుండు నొక్కండే. కాని ఇతరుడు కాడు. అని, అనుభవము వలన వ్యక్తమగుచుండెను. ఎట్లనగా చదువుకొనునపుడు విద్యార్థిగా నున్నవాడే పిమ్మట అతడే ఉద్యోగియై కొంత కాలము వెలుగొందెను మఱికొంత కాలమునకు అతడే ఉద్యోగవిరమణ మొనరించి విశ్రాంతి గొనెను. 1విద్యార్థియు, 2ఉద్యోగియు, 3విశ్రాంతి గొనినవాడును మువ్వురు ఒక్కడేగాని వేరువేరు వారు కారు గదా! ఒక్కడే మూడు అవస్థలననుభవించెను. 1 సేద్యగాడు భూమిని సంపాదించి దున్నెను. 2 గింజలనుచల్లి నాటు వేసేను 3 పంటను కోసి ఇంటికి చేర్చెను. ఈ మూడు అవస్థలను పొందిన వ్యక్తి ఒక్కడే కాని వేరు కాడు గదా! సారాంశము - స్వప్నస్థ పురుషుడు స్వప్నమున కాంచిన విషయము కనులు తెఱువగనే కానరాక పోయెను. అది వట్టిదని తెలియవచ్చెను. అట్లే జాగ్రదవస్థలో కాంచిన విషయములు కొంతకాలమునకు కానరాక మాయమయ్యెను. కనుక జాగ్రదావస్థయు హుళక్కియేనని తోచెడిని. ఇక గాఢ నిద్రను చెందిన సుషుప్తి అవస్థయునట్లే దబ్బరగ తోచెను ఎట్లన సుఖముగానిద్రించితిననెడు తెలివియు, నేనేమియు ఎరుగను నాకేమియు తెలియదు అని తెలిసికొనెడి తెలివియు, అనుభవించినవానికి కలదు. సుషుప్తిలో తా ననుభవించిన నిర్భరానందము మెలకువ కలుగగనే కానరాదయ్యెను. కాన సాషుప్తిక సుఖము గూడ స్థిరమైనది కాదు. కాన అదియు నసత్యమే అయినది. ఆ నిద్రాజనిత సౌఖ్యము శాశ్వతముగా లేదు. నిద్దురలేచి మేల్కాంచిన, జాగ్రదవస్థ యందు, వెంటనే మరల సంసార లంపటమున మునింగి దుఃఖమునే కలిగించుచున్నది. కాన సుషుప్తానందము నట్టి యసత్యమే కాని నిత్యమైనది కాజాలదని బోధపడుచున్నది. సత్యమైన ఆనంద మేది? కాన జాగ్రదవస్థలో గూడ సౌషుప్తిక సులానుభవమే నిజమైన నిత్య సుఖము. అదియే శాశ్వతానందమును పొందించును. కావున జాగ్రత్స్వప్న సుషువులు మూడు అవస్థలును స్వప్న సదృశ్యములై అనిత్యములేయని బోధపడుతుచుండును. తురీయావస్థలో, నిత్యసుఖము, ధుఃఖరాహిత్యము కలుగునవి పిండితార్థము ఇట్లు కైవల్యోపనిషత్తు మనకు బోధించుచున్నది. తెలిసిన జాగ్రదవస్థలో ఏ విధమైన దుఃఖమెరుగని సుఖమును (తెలివితో తెలిసికొని) అనుభవించుటయే తురీ యావస్థ అనబడును. మఱల ఏ అవస్థలోనికిని జారిపోవక కేవలం నిరంతర- నిరతిశయ- సుఖానుభూతియే తురీయాతీత స్థితికి తీసుకొని పోవును, ఆ అనుభూతిని పొందుటయే మానవత్వము సంప్రాప్తించినందులకు గల విశిష్టతయు, ఫలమును, విద్వాంసుని వైశిష్ట్యమును అయి యున్నదని ముఖ్యముగా గుర్తింపతగియున్నది. శ్లో. ఉపాయాః శిక్ష్యమాణానాం బాలానా ముపలాలనాః అసత్యేవర్త్మని స్థిత్వాతతస్సత్యం సమీహతే|| య్యితు క్తం శిక్షను అనగా బోధను లేక ట్రయినింగును లేక డ్రిల్లును పొందుచున్న బాలురను, చుట్టు మార్గము కాని, సందు గొందులు కాని, చక్కని రాజ మార్గమున లాలించుచు పాఠమున ప్రవేశ##పెట్టు ఉపాధ్యాయులు ప్రథమంబుగ అసత్య మార్గమున నుండియు, పిమ్మట సత్యమును ప్రకటింపజేయును అను పెద్దల సూక్తి (నుడి) కలదు. కాన ఉపాధ్యాయులు బాల బోధ కొఱకు ఉపయోగించు యక్తులను, ఉపాయములును, మొదట అసత్య వస్తు ప్రదర్శన మొనరించి, దాని మూలమున సత్యవస్తు జ్ఞానమును కలిగింతురు. 1 తోడేలు-మేకపిల్ల. జంతువులు మాటాడలేవు. 2 తుంగ-వేప చెట్లు మాట్లాడలేవు. 3 సింహము-చిట్టెలుక, 4 సింహము-నక్క 5 తోడేలు-గొల్లపిల్లవాడు 6 తాబేలు కుందేలు. ఇట్లు జంతువులు, చెట్లు ముచ్చటించినట్లు కధానికలను చెప్పుచు వాని నీతిని బాలురకు తెలియునట్లు బోధింతురు గదా! నిజమును విచారింపగా జంతువులు మాట్లాడవు వానిని చూపి, మాట్లాడు చున్నట్లు చెప్పి నీతిని బోధించుటలో అసత్యమును చూపి, సత్యమును బోధించుటయే గురుని ఆశయము గదా! అట్లే భగవానుడు సత్యమును తన ప్రతిబింబములగు జీవులకు బోధింప నెంచి మిధ్యయు అనాత్మయునగు జగమును, అసత్యమైన స్వప్నమును, కల్పించి, ప్రదర్శించి, నిత్యమును, సత్యమును, అగుయధార్ధ పరమార్ధ తత్త్వమగు ఆత్మను బోధించుచుండెనని తెలిసి కొనదగును. కన్నులకు కనుపించునది ''ఉన్నది, సత్యము'' అనియు మనకు ప్రత్యక్ష దృగ్లోచరము కానిది, ''లేదు- అసత్యము'' అనియ, భౌతిక వాదులగు ప్రత్యక్ష ప్రమాణ వాదులగు పూర్వపక్షుల యెక్క వాదము. ఇది వ్యావహారిక సత్యవాదము కావచ్చును కాని పారమార్ధిక సత్యము కాజాలదనుట నిర్వివాదాంశము. ప్రత్యక్షముగా కానవచ్చునది కొంత కాలమునకు కానరాకపోవచ్చును. అప్పుడది సత్యమెట్లగును? కాదు గదా! ప్రత్యక్షముగా కానరాకపోవచ్చును. కొంత కాలమునకు తన మనస్సునకు గోచరింపవచ్చును. అప్పుడది అసత్యమెట్లగును. కాదు గదా! ఇక భూత భవిష్యద్వర్త మానములగు త్రికాలములందును దేని చేతను బాధింపబడక నుండు వస్తువు సత్యపదార్థమనబడును. ప్రత్యక్షముగా కానవచ్చు వస్తువును కనపఱచి, దాని యందలి అనిత్యత్వమును=అసత్యమును, అసత్తను, అనాత్మను ధృవపఱచి, అసత్యత్వమును ప్రకటించి, కన్నులకు ప్రత్యక్షంబుగ కానరాని కతంబున, లేదని పలుకు వారలకు, కానరాని వస్తువును, క్రియాకలాప రూపమున కలదను నిత్యత్వమును బుద్ధికి గోచరించునట్లొనర్చి, సత్యమును ప్రకాశింపజేయునాతడు బోధగురువు, సద్గురు వనంబడును. అట్లు కానిచో జీవభ్రాంతిలో నున్న వారలకు ఆ గురువు మఱింత బరువు అనబరగును. మఱి ఆ గురువు గరువు అగును. మెరుగును కలిగింపక కరువును కలిగించును, సత్యమును మరుగు పఱచును. వానివలన అజ్ఞానము పెరుగును. బుద్ధిబలము తరుగును. కలదను సత్యవస్తువు పరోక్షమున నుండెనని తలంచుట యొక గొప్ప పొరపాటు. పరోక్షమున నున్న వస్తునని తలంచువారలకు అపరోక్షముగ నున్నదని తెలియజేయుటయే సద్గురుని ఆచార్యత్వ ప్రబోధము అని ఎఱుంగలవయును. శ్లో. యానిశా సర్వభూతనాం తస్యాం జాగ ర్తి సంయమీ యస్వాం జాగ్రతి భూతాని సానిశా పశ్యతోమునేః|| భ.గీ అ. 2. 69 శ్లో. సర్వభూతములు వ్యవహారమును ఉపసంహరించి, విశ్రాంతినిగొని, నిద్రజెంది యుండు సమయంబున, ముని పరమార్థ విషయమున మెలకువ గలిగి జాగ్రదవస్థను పొంది యుండును. సర్వభూతములును వ్యవహార విషయమున మెలకువ గలిగి సంచరింతురో, ఆ సమయంబున చూచుచున్న యతి వరే ణ్యుడు వ్యవహారమును (ఉడిగి) విరమించి నిద్రావస్థను చెందిన మాడ్కి కన్నులుండి చూచుచున్నను, చూడని చందంబున గ్రుడ్డివానివలె మెలంగుచుండును. కాన వ్యవహారమున ప్రత్యక్షముగ కానవచ్చునది అనిత్యమనియు, అసత్యమనియు, పరమార్ధమున, పరోక్షముగను, కనులకు కానరాను ఉండునది నిత్యమనియు, సత్యమనియు, తలంచుటయే అపరోక్ష జ్ఞానము అని భావము. పరమార్ధవస్తువు పరోక్షమున నుండక అపరోక్షముగనే యుండెనని ఎఱుగవలయును. అది జ్ఞాన నేత్ర గోచరమని భావము. సరతత్వమును తెలియకుండుట నిజమైన నిద్రావస్థ యనియు, ఇది వ్యావహారికముగా జరుగుచున్న జాగ్రత్స్వప్న సుషుప్తుల యందును, బాల్య ¸°వన కౌమార్య వార్థక్యావస్థల యందును కలదు, కనుక అత్మను విచారించి తెలుసుకొనని వాడు సదా నిద్రితుడని భావము సర్వ జగత్తునందును అంతర్యామిగా, అనుస్యూతమై, సూత్రాత్మగా, నున్న ఆత్మను దేహేంద్రియభూత సంఘముగా తిలకించుటయే వ్యావహారికముగా తలంచు స్వప్నము. ఇది జాగ్రత్స్వప్నముల రెంటి యందును ఉండును. కనుక ఆత్మతత్త్వము నెఱింగిన వానికి జాగ్రత్స్వప్నములు రెండును తాను అనుభవించు నిజమైన స్వప్నమువంటిదని భావము. కనుక ఆత్మజ్ఞానము లేని వారికి సర్వదా జాగ్రదవస్థయే లేదని భావము. అందుచేత ఆత్మను తెలిసికొనుటయే పరమార్థమున జాగ్రదవస్థయని తాత్వికుల అభిప్రాయము. ''బ్రహ్మ విద్యాలంకార'' అస్మత్సద్గురు వరేణ్యమూర్తి శ్రీముదిగొండ వేంకటరామ శాస్త్రి గారి అనుకంపచే శ్రవణ మొనరించిన ముఖ్య విషయములనే ఇందుపొందు పఱచి సోదర మహాశయుల కెఱిఁగింప యత్నించుచున్నాడను. పరతత్త్వ సాక్షాత్కారమనెడి పరమార్ధ సంబంధమగు జాగ్రత్తవలన ఆత్మతత్త్వము తెలిసికొనకపోవుట యనెడి ఆవరణము ఆత్మతత్త్వము జగత్తు అనుకొనుటయనెడి విక్షేపము, అగు వ్యావహారిక జాగ్రత్స్వప్న సుషుప్తులు అభాసయని నిశ్చయము గలిగి, అవి=అనగా ఆవరణ విక్షేపములు రెండును (నశింపగనే) క్షీణింపగనే అద్వితీయా ఖండ పరిపూర్ణానంద జీవ బ్రహ్మైక్యస్వారాజ్య పదవి లభించును- అని భావము సుషుప్తియందు ప్రతిదినము అవిద్యయదు మెలంగుచు తత్త్వము నెఱుగక అనుభవించు ఆనందానుభవమును వివేకము వలన తెలసి అనుభవించుటచే జీవుడు కృతకృత్యుడు అగును. మనము అన్యాసక్తచిత్తములో, పరాకుగా నుండి, బోధించెడి వారి బోధనుగాని, చెప్పుచున్న వారి ఉపన్యాసము గాని, వినక, పెడ చెవిని పెట్టియున్నచో, మనము మెలకువ గలిగి యున్నను, బోధకుడు=చోదకుడు నీవు నిద్దుర పోవుచుంటివా? యని హెచ్చరిక చేయుచు ముచ్చటించెను. ఇది లోకములో జరుగు హెచ్చరిక సామాన్యవిషమయే గదా! పరమార్థవిషయమున ఏమరుపాటు కలిగి పరతత్త్వము నెఱుంగక పోవటయే నిజమైన నిద్రావస్థయని ముఖస్థభావము, పరతత్తమును గూర్చి ఆలోచింపుచు, ఇతరులకు ఉపకారముగాని, అపకారముగాని చేయక పుణ్యమునుగాని, పాపమును గాని చేయ యత్నింపకను, గంగాది పుణ్యతీర్థములను సేవింపకున్నను, కురుక్షేత్రాదులందు దానములు చేయకున్నను, రేవాతీరమున, గోదా తీరమున తపంబు సలుపకున్నను, సమాధినిష్టలలో నున్న ఎడల, అది యథార్థమైన జాగ్రదవస్థయే యని ఎరుంగతగును. అత డితరుల కుపయోగింపడు గదా యని లోకములో కొందరనవచ్చు కాని తనను, తాను, తనను తెలిసికొనుటకు అనగా తాను తన నిజస్వరూపమగు స్వస్వరూపమును గ్రహి చుటకు ఉపయోగిచును గదా యని వారి ప్రశ్నకు సమాధానము త కన్నవేరుగా మఱియొకటి యున్న గదా! ఇతరులకు ఉపయోగించుట? అంతయు తానయై వెలుగొందువానికి సర్వదా జాగ్రదవస్థయే యనియు, ఆత్మను తెలిసికొనుటకు యత్నించివారనికి సర్వదా సుషుప్తి అవస్థలో మునింగి తేలియాడు చుండెననియు, భావము. ఇప్పడు లోకములో ఉద్యోగములు, వ్యవసాయములు, వ్యవహారములు, విద్యావ్యాసంగములు చేయుచున్నను, చలనచిత్ర దృశ్యములను, నాటకములను, మెలకువ గలిగియు, చీకటి=అజ్ఞానములో చుచుచున్నను, జీవులందరు గాఢనిద్రలో సంచరించు చున్నవారనియే తలంప వలయును. ఈ మెలకువ-మెలకువ-కాదు ! అది అజ్ఞానమే. ఆ చీకటిలో చూచుట యనగా స్వప్నమున చూచుటవంటిదని భావము ఆత్మతత్త్వమును గూర్చి మేలుకొనుటయే నిజమగు మెలకువ (జాగ్రదవస్థ) అని ఎరుంగదగును. శివరాత్రి-ఏకాదశి నాడు చేసెడి జాగరమునకు నిజమగు భావము (భగవత్తత్త్వమును గూర్చి మేలుకొనుటయే యని భావము) ఇదియే సుమా! ఇదియే ముమ్మాటికిని, నిత్యము, సత్యము, పథ్యము, తథ్యము అస్యము తచ్ఛుము. ఈ విషయమునే యాజ్ఞవల్క్యోపనిషత్ ఇట్లు తెలుపుచున్నది! జగద్గురువు కృష్ణ పరమాత్మ భ.గ. అం.7.69 శ్లొకమున తెలిపెను. శ్లో. యత్రసుప్తా జనానిత్యం ప్రబుద్ధ స్తత్ర సంయమీ ప్రబుద్ధా యత్రతే విద్వాన్ సుషుప్తింయాతి యోగిరాట్ వ్యాఖ్య. యత్ర=నిశాయం, జనాః=లోకాః, నిత్యం=ప్రతిదినం, సుప్తాః=నిద్రా ముపగతాః, తత్ర=నిశాయాం, సంయమీ=యతిః, ప్రబుద్ధః=జాగర్తి యత్ర=దివాసమయే, తే=సర్వేజనాః, ప్రబుద్ధాః=జాగ్రదవస్థా ముపగతాః, తత్ర ఇత్యాధ్యాహారః, తస్మిస్సమయు, విద్వాన్=యోగిరాట్, సుషుప్తిం=నిద్రాం, యాతి=అనుభవతి. ఇతిభావః, తాత్పర్యము- అనగా జనులు వ్యవహారకాలమున, నిద్రితునివలెను, జనుల నిద్రాసమయమును, జాగరమును=మేలుకొని యున్నవాడై యోగి ప్రవరుడు వర్తించునని భావము. ఒక ప్రభువు తన రాజ్యమున పగటిన రాత్రిగను; రాత్రిని పగటిగనుచేసి పాలించెనని యొక ప్రధ కలదు. ఆ రాజువేదాంతియని భావము, అతడే యోగిరాట్ అని భావము. సినిమా (చలన చిత్ర ప్రదర్శనము)ను పరిశీలింపుడు. తెరమీద కనుపించు పటమున గల ఛాయా ప్రతిబింబ వ్యక్తి - ఎలక్ట్రిక్ దీపకాంతి మూలముననో, ఛాయచిత్ర గ్రాహకుని చాక చక్యము వలననో, మేకప్ (వేషము నిర్మించువాని) చేయువాని హస్త నైపుణ్యముననో, కాని ఆ బొమ్మలోని ఁసౌందర్యము ఆ నటుని (మానిషి) యందు కానరాదు. వాని పాట, కంఠధ్వని, మాధుర్యము, శ్రవణవేయముగ నుండెనని తలంతుము. కాని ఆ పాట (బ్యాక్ గ్రౌండ్) వెనుక మఱియెక రెవరో పాడిన పాటయే కాని ఆ పటమునగల నటుని యొక్క సహజమైన గాత్ర పాట కాదు. అని తెలుసుకొనగలుగుచుంటిమా? లేదు గదా? ఆ ధ్వని మైక్ మిషన్‌లోని సౌండు బాక్స్ యెక్క నిపుణతయే గాని ఆ నటుని నైసర్గిక గాత్ర పాట కాదని ఎరుంగ గలుగుచుంటిమా? కాదు గదా! బొమ్మలోని వేషమును చూచి భ్రమించి మనస్సును కలవర పెట్టుకొనుచుండిరే కాని అది తెర. కాని తెరమీద చలించు ఛాయా చిత్రము. కాని మానిసి కాడు. అని సినిమాను చూచినపుడు భావించుచుండిరా? లేదు గదా! కాన సత్యమును అసత్యముగను, అసత్యమును సత్యముగను గోచరింపచేయునదియే మాయాశక్తి అని గ్రహించవలయును. '' నా మా యా శక్తి అతిక్రమింపరానిది నన్నెవరు ప్రపత్తితో స్మరించుచు మనన మొనర్తురో వారీనా మాయాశక్తిని దాటగల''రని కృష్ణభగవానులు తమ గీతలలో గాన మొనరించిరి. అట్లు మాయను జయించి స్వాధీనము చేసుకొనిన ఎడల నిజమగు సత్యవస్తువు గోచరించునని విశ్వసింపవలయును. తన గురువు గాని, తాను గాని చూడని, హిమాలయపర్వతమును, ఖండాంతరములను, చూచినట్లును, ఎఱిగినట్లును, బోధించుటయు, పరోక్షమున నున్న దానిని ప్రత్యక్షముగా నున్నట్లు బోధించుటయు, విద్యార్థులను విహార యాత్రలకు వెంటగొనిపోయి చూపుటకు గాని, దానిని వస్తురూపమున తరగతి గదిలోనికి తెచ్చి చూపుటకు గాని, సాధ్యపడని, అసాధ్యమైన కారణమున అసత్యవస్తువును కనుపఱచి, సత్యమునుగ బోధించుటలో ఉపాధ్యాయ (గురు)ని యొక్క అభిప్రాయమేమి? ఒక వస్త్రఖండముపై జిగురు (పేస్టు) రాచి, కాగితము నంటించి దానిపై నాలుగు పలకల చతురశ్రపు సిరా గుర్తులను, గుండ్రని గురులను, చుక్కలను, గొంగడి పురుగుల వంటి గీతలను, వంకరగీతలను, జంటగీతలను వ్రాసి, ''
'' చతురశ్రపు గుర్తునకు, రాజ్య ప్రధాననగరమగు డెల్హీ యనియు, మన భాషాప్రయుక్త రాష్ట్ర విభజనలచేసి గుండ్రని గుర్తు ''ం''ను, రాష్ట్ర ముఖ్య పట్టణమగు కలకత్తా, బొంబాయి, మదరాసు, హైదరాబాదు, అనియు, గొంగడిపురుగుల వంటి గీతలకు హిమాలయము మున్నగు పర్వత శ్రేణులనియు, వంకర గీతలకు గంగా, సింధు, బ్రహ్మపుత్ర, యమున, తపతి, నర్మదా, కృష్ణ, గోదావరి, కావేరి, వైఘ, తామ్రపర్ణి, పినాకిని, స్వర్ణముఖి మున్నగు నదులనియ, జంటగీతలకు అయోమయ శకటమార్గములనియు చూపుచును, ఆసియా, ఆఫ్రికా, అస్ట్రేలియా, ఐరోపా, అమెరికా యను ఖండములనుచును, వేరు వేరు రంగులను చూపుచు, భూభాగ ఖండములనియు, కనుపఱచుచు, అసత్యమైన వస్తువును చూపి, సత్యవస్తు జ్ఞాన బోధకై గురుడు ఏమేమో బోధించు చుండుట మనము పాఠశాలలో గాంచుట లేదా? తాను గాని, తనకు విద్య నేర్పిన గురుడు గాని చూడని హిమాలయములను, తన గురువు చూచి తనకు చెప్పని తాను చూడని పర్వతములను, నదులను, పొగబండ్ల దారులను, గొప్ప దూరదేశమునకు పోవు మార్గములను, పత్తనములను ఖండములను, గూర్చి వారు బాలురకు అనృతమును బోధించుట గురుని ప్రధానమైన=నిజమగు, ప్రధమదోషము (తప్పు) కాదా? తన గురువు చూడని మాట సత్యము. తాను చూడని మాట సత్యము. ఆ పటము గుడ్డముక్కతో నిర్మింపబడిన మాట సత్యము. ఆ పటమును తన తరగతిలోని పెద్దయగు (క్లాసుమానేటర్) బాలుడు సైన్సులేబరేటరీలో గుమాస్తాను అడిగి తెచ్చినమాట సత్యము. ఆ పటము నదులు, పర్వతములు, ఇనుపదారులు, పట్టణములు కాని మాట సత్యము. ఎవరో దేశమునును తిరిగి సంచారమొనర్చి పరిశీలించి హిమగిరులు భారతదేశమునకు ఉత్తరాభాగమున ఉన్నవని గ్రంధరూపమున వ్రాసినమాట సత్యము. అట్టి ఆప్తవాక్యమును ప్రమాణముగా గైకొని ఒజ్జ తమకు బోధించుచున్న మాట సత్యము. కాన అట్టి కొండలు, నదులు, పట్టణములు కాని అసత్యవస్తువగు, వస్త్ర ఖండమగు పటమును చూసి సత్యవస్తువును బోధించుటకై యత్నించు మాట సత్యము. పాలనుంచి వెన్నను తీసినట్లు అసత్యమగు పట ప్రదర్శనము చేసియు, భూమి, ఆకారము సూర్యచంద్రుల ఆకారమును చూపి, భూమి తిరుగుచున్నట్లు రేయింబవళ్ళు కలుగుచున్నట్లు సత్యవస్తువును, సత్యవిషయములను, బోధించుట) యొజ్జ యొక్క ముఖ్య లక్షణము. అట్లే అసత్యమగు (మిథ్యా) జగమును చూపి, అందు నిలిచి, అందలి సత్యవస్తువును బోధించుటయును,--అధర్మవర్తనముగల లోకమునకు ధర్మ ప్రబోధనమొనరించుటయు, -పీఠాధిపతులగు జగద్గురువుల ప్రధానలక్ష్యము, లక్షణమును, అయియున్నది. లోకము అన్యాయమున మునిగి చరించుటచే ప్రభువు (రాజు) న్యాయస్థానములను, న్యాయతీర్పరులను, న్యాయవాదులను, న్యాయమును ప్రకటించు సూత్రగ్రంథములను, ఏర్పఱచెను. అసాధ్యమైన పర్వతపంక్తులను, నదులను, నదీవాలాటములను, ఘాతుక జంతువులను, క్రూరమృగములను, ఘోర సర్పములను, ఖగోళములోని నవ గ్రహములను, నక్షత్రరాశులను, బోధనాగృహమగు విద్యాలయములోనికి గొనివచ్చి లేత మనోవృత్తులుగల పసిబాలురకు చూపి బోధించుట కష్టసాధ్యము. కనుక, అది అసాధ్యము కనుక, అసత్యమును అయిన పట రూపము అయిన వస్తు ప్రదర్శనము చేన, సత్య వస్తువును బోధించుటకు సాధించుచుండెను. అక్రమముగా సంచరించు విద్యార్థులను క్రమశిక్షణములోనికి తీసుకొని వచ్చుట, అసత్య భాషణమొనరించు బాలబాలికలను సత్యమును పలుకమని గొల్లపిల్లవాడు-తోడేలు, విప్రబాలుడు తండ్రితో కాశికి నడచిపోవుచు పులియని యఱచుట, హరిశ్చంద్ర చక్రవర్తి, మున్నగు కథానికలను చెప్పి బోధించుట ఉపాధ్యాయుడు చేయుచుండు ముఖ్యకార్యము. ''యద్దృశ్యంతన్నశ్యం'' ఏది కనిపించునో అది నశించుననియు, ''బ్రహ్మసత్యం- జగన్మిధ్య'' బ్రహ్మము సర్వాంతర్యామియై- అనూస్యూతమై-సర్వత్ర వ్యాపించి యున్నందున సత్యము, అనగా త్రికాలాబాధ్యమైనది. జగత్తుమిధ్య ఉన్నట్లుగా తోచును. కాని శాశ్వతము కాదని తెలుపుచు బోధింతురు గురువులు. ఇదియొక విధమైన ప్రథమ తరగతి శిష్యులకు ఉపదేశించెదరు. ''బ్రహ్మసత్యం జగత్సత్సం'' అని వేరొక విధమైన శిష్యసంతతికి బోధింతురు. వీరు జ్ఞానమున కొంచెము అధికతర స్థితియందు ఉన్న వారని భావము బ్రహ్మము సత్యము అనగా పరమార్థ సత్యము. జగత్సత్యం అనగా వ్యావహారిక సత్యము, అనియు భావము. ఈ వివరమును ఎరిగిన శిష్యుల కిట్లు గురువులు బోధించెదెరు. కాన వివేకమలు దృఢమైన కొలదియు సర్వము సత్యస్వరూపమగు బ్రహ్మముగానే తోచును. ''సర్వం ఖల్విదం బ్రహ్మ'' సర్వము బ్రహ్మస్వరూపమేయని భావము. ''పశ్వేత్ బ్రహ్మమయం జగత్'' జగత్తును బ్రహ్మమయమునుగా పరికించుమను భావమును వ్యక్తపఱచుచున్నది సుమా! సీత యను జీవుడు అవిదయను సుముద్రముచే పరివేష్టింపబడిన దేహమనెడి లంకా పట్టణమునకామక్రోధలోభమోహ మద మాత్సర్య ఈర్ష్య అసూయ దంభ దర్పము లనెడి దుర్గుణములనెడి దశకంఠునిచే గొనివచ్చి దాచబడి యుండెను. లేక ఆగడ్తచే చుట్టువారు కొనియున్న రాజకోటవలెను, సంసారముచే ఆవరింపబడిన దేహమను లంకాపురి యందు దాచుబడి భాద నొందుచు, రాక్షస మగువలచే వినరాని భయంకర సంభాషణమును విసజాలక దుఃఖి చు చుండెను. అంతట ఆంజనేయుడనెడి సద్గురుడు తాను జీవుని ఎట్లు ఈ దుఃఖము నుంచి తరింప చేయవలయునను విషయము ఎం తయో పాఠబోధకు సిద్ధపడిన సిద్ధగురువ రేణ్యుడు హనుమ. ఆ మహామహుని నడవడికను, అతని ఆలోచనమును, వాని యత్నమును, పరోపకార పారీణతయును, వాల్మీకి మహాముని తమ రచనయగు శ్రీ రామాయణమున ఐదవ కాండమగు సుందర కాండమున ప్రకటించి యుండెను. దానిని పఠించి గాని, శ్రవణ మొనర్చి గాని, ప్రతి వ్యక్తి గ్రహింపతగి యున్నది. పీఠాధిపతుల పాలనమునకును, ప్రబోధమునకును, ప్రచారమునకు, సాఫల్యము కలుగును. దేశ పాలకుల పాలనమునకు చరితార్థమగును. అవిద్యలోనున్న జానపదులకు విద్యానందమున నోలలాడించుటకే విద్యాలయములును, విశ్వవిద్యాలయములును, కళాశాలలును, ప్రభుత్వము ఏర్పఱచిరి. క్షరమైన జగత్తులోని వారలకు, అక్షర (నశించని=ఆత్మ) జ్ఞానమును కలిగించుటయే సద్గురుని ప్రధానాశయము. అదియే ఆచార్య పురుషుని ముఖ్య లక్షణము- ''యద్దృశ్యం తన్నశ్యం'' అను సూక్తి వలన దృశ్యజాలమును కనుపఱచి, నశించని, శాశ్వతమైన, వస్తువగు (అదృష్ట) అదృశ్య వస్తువును బోధించుటయే సద్గురు పుంగవుని ప్రధాన లక్ష్యము అప్పుడు Jdg యొక్క ఉద్దేశము, ఆశయము సంపూర్తిగా నెఱవేరును. అజ్ఞానములో నున్న ప్రజానీకమునకు జ్ఞాన బోధచేయుటయే సదాచార్యుని ముఖ్యలక్షణము. ఉపాధ్యాయుని విధి అదియే దేశికుని హితబోధ. పరమహంస పరివ్రాజకా చార్యుల ప్రధాని ప్రచారము జగద్గురని ముఖ్యాశయము. సర్వజీవాళికి నరణీయ నివయము అనియే ధ్యేయము, అదియే గమ్యము అదియే తారకము, అనగా తరణోపాయము అల గుర్తింపవలయును. కనుకనే శ్రీరాజాజీ శ్రీమాన్ చక్రవర్తుని రాజగోపాలచార్యులవారు ప్రతి కళాశాలలోని విద్యార్థులకును రామాయణముచు చదువమని ప్రబోధ మొసరించిరి. కనుక ఈ బోధనలన స్వప్నమువలెనే జాగ్రదవస్థయు వట్టిదని (మిధ్య)యే అని పర్యవసితమగుచున్నది. ఇక సుషుప్తిలోని సుఖము నిత్యసత్య స్వరూపము. అదియే నీ నిజస్వరూపము. అదియే స్వస్వరూపము. అదియే నిత్యము. అని గురువు బోధించే ననుకొందుము. (నిజమగు సుఖము సుషుప్తిలోని సుఖమును, చవిచూపి, ''ఇట్లే సుఖము ఉండునని తెలుపుటకు మాత్రమే.'' సుషుప్తి కల్పింపబడినది. కాని ఇదియు నిజమైన సుఖము కాదు. కారణమే మనగా అది జాగ్రదవస్థకు చేరగానే, మరల సుఖము మరుగుబడి, మరల సంసార దుఃఖమునుకలిగించుచున్నది. కానని త్యసుఖము అది కాదని తెలియుచున్నది. సుషుప్తిలో అవిద్యావరణ విక్షేపములతో గూడి ప్రతిదినము మనమనుభవించు ఆనందము, సుఖము, వివేకము వలన తెలిసి అనుభవించవలెను. జాగ్రత్స్వప్న సుషుప్తులు మూడును యథార్థమునకు స్వప్నము వంటివేయని విద్యారణ్యుల వారు తమ రచనయగు అనుభూతి ప్రకాశికామూలమున తెలిపి యుండిరి. కాన వివేకము వలన తత్త్వము నెఱిగి సుఖము ననుభవించుట వలన, అది వెనుకకు మరలక, నిత్యమై, సత్యమై వెలుంగుచుండును, అది తురీయము అనదగును. సమాధి నుండి మరలిన ఎడల తురీయము గూడ అవస్థాత్రయము వంటిదే యగును, కాని తురీయాతీత స్థితిలోమరలక యుండు, దుఃఖరహిత, నిత్యసుఖము నీ స్వరూపము. అదియే సత్యమైన పరమార్థ సుఖము అని గ్రహింపవలయును ఎట్లన దేహి=జీవుడు గాఢ నిద్రాస్థితియగు సుషుప్తియందు, జాగ్రదవస్థయందలి విషయవాంఛలుగాని, స్వప్నావస్థ యందలి అడవిలో పులి వెంబడించుట వలన గలుగు భయకంపాదులు గాని, మిత్ర - బంధు - దర్శన - భాషణముల వలన గలుగు సుఖసంతోషాదులు గాని, ఏ మాత్రము లేక కేవల శుద్ధానందముతో నండును. అది ముక్తావస్థలోని ఆనందము వంటి ఆనందమును సూచించు (బోధించు)నట్టి యొక్క స్థితి, కాని ఆ ఆనందము ముక్తావస్థయందలి నిజమైన నిత్యసత్య నిర్వి కల్పానందము మాత్రము కాజాలదు. అది ముక్తావస్థలోని నీ నిజస్వరూపమగు స్వస్వరూపమని తలంపగూడదు. స్వస్వరూపానం దానుభవము వలె కాననగును. సుషుప్తి యందు అవిద్యోపాధి కలదు. సహజావస్థయందలి నిజానందమగు స్వస్వరూపస్థితికి ఉపాధి యుండదు. సుషుప్తిలోని ఆనందమే ముక్తావస్థ యయినయెడల సర్వజీవులును, ప్రతి దినము నిద్రించు (సుషుప్తినొందు) చునే యుండిరి గదా! అపుడు సర్వజీవులును ముక్తులే యనవలసి వచ్చును. అవిద్యోపాధి యున్నంత కాలము నిజానందుము సహజావస్థ లభ్యము కాదు. నిద్రలో అవిద్యోపాధి యుండును. సుషుప్తి నుంచి మరల జాగ్రదవస్థలోనికి జీవుడు వచ్చును, అప్పుడు సుషుప్తియందు తాననుభవించిన సుఖము ఏ మాత్రము కానవచ్చుట లేదు. నిద్రించినవాడును, వచ్చినవాడును, సమానులందురు. అనగా సుషుప్తిస్థితి మరణావస్థ వంటిదని భావము, మరణావస్థ యందు జీవుడు వేయి వృశ్చికములొక తూరి కుట్టిన బాధనొందునని వేదాంత వైద్యశాస్త్రములు తెలుపుచుండును. కాన సుషుప్తియు, అట్టి వృశ్చిక దష్టావస్థ వంటిది కాదు సుమా! ఇప్పుడు చెప్పబోవు నిద్రావస్థ మరణావస్థ సమానము లనగా నిద్ర (సుషుప్తి) మరణమును పోలి యుండునని భావము సుమా! 1. సుషుస్తిలో జీవుడు సుఖానందముల ననుభించును. మరణమున జీవుడు సుఖమును ఆనందమును అనుభవించుట లేదు. 2. సుషుప్తిలోని జీవుడు, తట్టి కొట్టి పిలిచిన పలుకును. మేల్కాంచును. మరణమున జీవుడు కొట్టినను, తట్టినను పిలిచినను, పలుకజాలడు. మేలుకొనడు. 3. సుషుప్తిలో జీవుని దేహమున ఉచ్ఛ్వాస నిశ్వాసములు కానవచ్చును. మరణమున శ్వాసప్రశ్వాములు లేని కళేబరము కాననగును, కాని ఆ నిద్దురలేచిన, దేహి మరల జాగ్రత్ప్రపంచమున మెలగును. మరణావస్థలో అట్లు మరల లేచి జాగ్రదవస్థ యందువలె జీవుడు చలించుట లేదు. మరణావస్థను పోలి యుండుననుటకు మాత్రమే మనకు నిద్రావస్థ కల్పింపబడి జీవునకు బోధ కొఱకు మాత్రమే ఏర్పడియున్నది. సుషుప్తిలో నున్నట్లు, జాగ్రదవస్థ యందువలె తెలిసి, సుషుప్తిలోని సుఖమును అనుభవించుటయు, సుషుప్తి యందు శరీరము, అవయవములు చలింపనట్లు జాగ్రదవస్థ యందును దేహి మెలగుటయు, అగ్నికరణము, అంకముపై నుంచినను, తెలియని ఉనికి, సమాధి (ప్రశాంత) స్థితియని గ్రహింప వలయును. మరణావస్థయందు ఉన్నట్లు దేహి మెలంగుటయే, నిర్వికల్ప సమాధిస్థితి యని ఎఱుంగ తగియున్నది. మనస్సు క్షయించిన పిమ్మట ఆత్మజ్యోతి వెలుంగును. మరణము ఒక జన్మమునకు అంతిమస్థితి. బ్రహ్మ-విష్ణు-రుద్ర-ప్రళయములు ఇట్టివే సుమా! ప్రళయము కొంతకాల ప్రమాణ నియతిని మాత్రము సూచించును. నిద్దు=సుషుప్తి నిత్య (ప్రతిదిన) మరణమును సూచించును. ఱప్పవాల్చుట క్షణ ప్రలయమును లేక క్షణ మరణమును సూచించును, రెండవ మరణము లేకుండుట యనెడిదియే నిజమైన మరణము, అదియే జీవునకు ముక్తి. అవిద్యోపాధినశించుటయని భావము. అది యథార్థమైన బ్రాహ్మీస్థితి. అట్లే ఒకసారి జనించినవాడు మరల జన్మము లేకుండ చేసికొనుటయే నిజమైన జన్మము కలవాడు. అనగా మరల జన్మము లేకుండ చేసుకొనుటకు మానవుడు యత్నించవలయును. అతడే సార్థకజన్ముడగునని భావము. సుషుప్తి స్థితియు, మరణిస్థితియు, దేహికి దేహము ఉండగనే కలుగుటయే విదేహముక్తి లేక జీవన్ముక్తి యనబడును. కొందఱు బోధకులు దేహము వదలిన పిమ్మట గలుగు ముక్తికి దేహముక్తి యనియ; దేహము ఉండగ గలుగు ముక్తికి జీవన్ముక్తి యనియునందురు. కాని జనక మహారాజునకు విదేహుడని ప్రసిద్ధనామము కలదు. కారణమేమి? అనగా దేహము ఉండగనే దేహభ్రాంతిని, దేహాభిమానమును, వదలిన మహాభాగుడగుటచే అతనికి విదేహుడని ఖ్యాతి కలిగెను. కాన దేహాభిమాన రాహిత్యము, దేహభ్రాంతి రాహిత్యము గూడ విదేహముక్తియని చెప్పవచ్చునని భావము. కాన ఇచట విదేహముక్తి-జీవన్ముక్తి-శబ్దములు సమానార్థకములుగా ప్రయోగింపబడినవని గ్రహింపవలెను. ఈ స్థితిలో నుండి దేశభ్రాంతి, దేహాభిమానము లేకుండటయే అవిద్యావినిర్ముక్తి ఇదియే మోక్షము, ఇదియే బ్రహ్మభావము, యని భావము దేహము నందలి=సంసారమునందలి, భ్రమ భ్రాంతి, మోహము క్షయించుటయే మోక్షమనబడును, మోహము-క్షయించుట అను రెండు పదముల ఆధ్యక్ష రముల కలయిక వలన మోక్షశబ్దము కలుగును. శబ్దార్థము గూడ కలుగును. ముముక్షువునకు, బంధ అవిద్యావిముక్తి కలుగుటయే ముక్తి యనబడును. ముముక్షు - బంధ వినిర్ముక్తి శబ్దముల ఆద్యంతాక్షర సమ్మేలనము వలన ముక్తి శబ్దము ఏర్పడుచున్నది. చదువరులకు రచయిత, చెప్పిన దానినే మరల చెప్పినట్లును, వ్రాసినదానినే మరల వ్రాసినట్లును, పౌనఃపున్యదోషమాపాదించుచున్నదని తలంపవచ్చు. పఠితలకు లెస్సగా తెలియుటకును, మనస్సునకు బాగుగా పట్టుటకును, సందర్భానుసారముగా వ్రాయక తప్పలేదు. గీతాచార్యులే తమ గీతలలో చెప్పినదానినే మరల చెప్పినట్లు తోచును. ఇక దారకాచార్యలు చెప్పినదానినే చెప్పుటలో ఆశ్యర్యమేమున్నది? కాన తాను నిత్యసుఖ స్వరూపుడనని ఎఱుంగ వలయును. ఈ అనుభవించు సంసార దుఃఖమేల సంభవించెను? ఇల్లు వాకిలి, ఆలుబిడ్డలు, దేహము నాది, నాది, యను మమత, మమకారము, ఆహంత, అని ఆయా విషయములతో తాదాత్మ్యమును పొందుటచే కలిగిన దీ సంసారము. కాన జాగ్రత్సుషు ప్త్యవస్థలు రెండును కాని సంధియే స్వప్నము కాన సంధియన స్వప్నమని భావము. [రచయిత జనించిన సమయమున ఏర్పడిన సూర్యాది నవగ్రహముల ప్రభావము జాతకునిమీద ప్రసరించుటవలన, వాహనాధిపతియును, సప్తమాధిపతియును అగు బ్రహస్పతి ఇంట శని యున్నందున సంధి కలుగును. సంధియే స్వప్నము. సంధియందు జేయు ధ్యానమే నంధ్యోపాసనము కాన సంధ్యోపాస్తి యందు వీనికి అభినివేశము కలిగెను. కన్యాలగ్న జాతకుడగుటచే లగ్న రాజ్యాధిపతియగు బుధుని ఇంట వాగ్భాగ్యాధి పతియగు శుక్రుడుండుటచే గ్రంధరచనమునకు ప్రేరణ కలిగెను. ఆ దశమమునందే ఉచ్ఛస్థితిలోని రాహు వుండుట వలన గ్రంథ రచనమును, ముద్రణ వ్యసనమును, అనెడి ''పిచ్చి'' (మోస్టు ఇంటరెస్టు) కలిగెను. విద్యాస్థానాధిపతియగు, గురుడు ఉచ్ఛరాశిలో నుండుటచే, వీని, బుద్ధిని, గ్రంథ రచన ముద్రణ - పిచ్చి - వ్యసనము. ఆలోచనల యందు ప్రోత్సహించెనని గ్రహచేష్టాబలముచే నూహించబడుచున్నదని మనవి చేయుచున్నాడను.] స్వప్నమువలన, కనుదెఱచినంతనే అది వట్టిదనియు, విమర్శించి చూడగా జాగ్రదవస్థయుగూడ వట్టిదే స్వప్నతుల్యమే యనియు, సుషుప్తి వంటి సుఖ స్వరూపావస్థ సత్యమనియు తెలిసికొనుటకును, తెలుపుటకును, అసత్యమైన (మిధ్యయైన) స్వప్నము మహోపకారకమైనది. అనగా స్వప్నావస్థవలన స్వప్నానుభము ఎట్లుమృష యో, అట్లే జాగ్రదవస్థలోని విషయానుభవము గూడ రిత్త (మిధ్య)యే! యని గురుకృపా కటాక్షలబ్ద శాస్త్రజన్యజ్ఞానము వలనను ఆప్తవాక్య ప్రమాణములనను, అనుభూతివలను, తెలిసికొని స్వప్నమును పోలిన సంధికాలమున చేయు ధాన్యము ఎందుకోఱకనగా-స్వప్న సదృశ ఫలములను గాంచగలుగు జాగ్రదవస్థయందలి అవగా ఐహిక భోగభాగ్యములును అనుభవములును స్థిరమైనవి కావు. అనియు పారలౌకికమునకు సాధనభూతములగు కర్మలు, ధర్మములు, శ్రవణములు, ఆచరణములు, సత్యాన్వేషణమునకు ఉపయుక్త ములనియు, ఎఱిగి, స్వప్నభోగములవంటి ఐహిక సుఖమభోగములందు, అనగా విషయములందలి, దోషదృష్టిజిహాస, అదీనతా లక్షణములగలిగిన విరాగముకలిగి సంధ్యాకాలధ్యానాభ్యాసపాటవమున. ఆ విరాగము ధృఢపడి, (జ్ఞానము ఘనీభవించి ప్రజ్ఞాన ఘమడై) పారలౌకిక శుభేచ్ఛాజనిత సుఖప్రదకర్మాను భవమును గాని, పారమార్ధిక చింతానుభవమును గాని వాంఛింపుచుండ వలెనని ''వరేణ్యం'' అనుపదము తెలుపుచున్నది. వరణీయమైనది యేది? అనగా ''భర్గః''= తేజము. ఆ భర్గస్సును ''ధీమహి'' యన ధాన్యముచేయు చున్నారమని ఎరుంగవలయును. ఇంద్రియ (గ్రామము) సమూహముతో చేయు ధ్యానము. సాంఘిక ధ్యానము పుత్ర-మిత్ర-శిష్య-బంధు సంఘముతో చేయుసాంఘిక ధ్యానమే సంధ్య. అట్లే సంధికాలములో చేయు ధ్యానము జాగ్రదవస్థలోని విషయ చింతనములను, స్వప్నావస్థవలెమృష (మిధ్య)యనియు, సుషుప్త్యవస్థయందలి సుఖానుభవమువలె నిత్యశుద్ధబుద్ధముక్త నిత్యసత్య సుఖస్వరూపమును ఎరుంగుటకు ఈ సంధి కాలములోని చిచ్ఛక్తియొక్క సాంఘికముగా చేయు ఉపాసనము జగద్గురువగు పరమాత్మచే జీవోద్ధరణమునకు కల్పించబడి, వ్యావహారిక గురువగు పితృపాదులచే గాయత్రీ మహామంత్రోపదేశము, ఉపాసన విధానము, బోధింపబడినదని యెఱుంగ తగి యున్నది. మరియు, రాత్రియొక్క చివరిభాగము పగటి యొక్క ఆరంభ కాలము సంధి కాలము. ఇది ప్రాతస్సంధ్యాసమయము పగటి యొక్క చివరి భాగము రాత్రి యొక్క ఆరంభకాలము గల సమయము సంధికాలము. ఇది సాయం సంధ్యాకాలము. ఆ కాలమున పగటి చివరకాలము కనుక పగటివలె వెలుతురు కొలదిగ నుండును. రాత్రి యొక ప్రారంభ కాలము గనుక రాత్రి వలె చీకటిని కలిగియుండును. అప్పుడు పగటి రేల, లేక రేయింబవళ్ళ యుభయు లక్షణములు కలిగియుండును. అట్లే స్వప్నము జాగ్రత్త యెక్క చివరను సుషుప్తి యొక్క ఆరంభమును కలిగిన అవస్థ స్వప్నము. కాన 1. ఈ స్వప్నావస్థ జాగ్రదవస్థ వలె వస్తు ప్రత్యక్షము లేకుండినను, ఆకార సాక్షాత్కారమును కలిగించుచు జాగ్రతికా (జాగరితా)ను భవమును పోలిన స్థితిని, 2. సుషుప్త్య వస్థ వలె గాఢ నిద్రయందు స్థూల శరీరము, దాని అవయవముల యొక్క నిశ్చలతను కలిగియుండు స్థితిని, ఈ పై రెంటిని కలిగి జాగ్రత్సుషుప్త్యవస్థల యొక్క లక్షణములను కలిగి యుండును. అచ్చుల లక్షణములగు ఉచ్ఛారణమును, హల్లుల లక్షణములగు ''అచ్చుల సహాయము లేనిది పలుక జాలని స్థితిని,'' కలిగి యుండిన, అర్ధానుస్వారము, అనుస్వారము, విసర్గము అను ఉభయాక్షరముల పగిది, స్వప్నము జాగ్రత్సు షుప్తులనెడి అవస్థల ఉభయావస్థా లక్షణములను కలిగి యుండెను. కాన స్వప్నావస్థ సంధ్యా కాలము వంటిదని చెప్పనొప్పును. సందేహం లేదు మైత్రేయోపనిషత్ ఇట్లు తెలుపుచున్నది. నతేః - నతమః సంపూర్ణముగ వెలుతురు లేనందున అదిః పగలుకాదు అనగా వెలుతురు=తేజస్సు కాదు. సంపూర్ణముగ చీకటి పడనందున రాత్రి (తమస్సు=చీకటి) కాదు. అనగా చీకటి=తమస్సు గల రాత్రికాదు. పగలు కానట్టియు రాత్రి కానట్టియు గ్రుడ్డి వెలుతురు, స్వల్ప చీకటిని కలిగిన కాలము. అది సాయం కాలము. ఇక ప్రాతః కాలమున=ఉదయము వేళ చూతమా? రాత్రి కాదు. తెల్లవారుచున్నది. అనగా కొలది వెలుతురు వచ్చుచున్నది. పగలందమా? సూర్యు డుదయింపలేదు. కాన ధారళ##మైన వెలుతురు రాలేదు. రాత్రి పగలు రెంటి లక్షణములు గల సమయమది. అది ప్రాతస్సంధ్యా కాలము కాన అదియే=అట్టిదియే సంధ్యా సమయము. జాగ్రత్సుషుప్తుల నడుమ గల కాలమగు స్వప్నము వంటిదని తెలియుచున్నది. ఆ కాలమే ఉపాసనమునకు తగిన ముఖ్య కాలమని శాస్త్రములు తెలుపుచున్నవి. అది బ్రాహ్మీ మూహుర్తము ''మహర్షులు బ్రహ్మమును'' ఉపాసించు కాలము. ఆ సమయమునందే మహా మునుల బ్రహ్మధ్యాన ప్రసారములు వెలువడును. ఆ సమయమున మన ముపాసించినచో ఆ ప్రభావము మనపై ప్రసరించునని భావము. ఆకాశవాణి ప్రసార సమయమునందే మనకురేడియో ధ్వని వినిపించును. కాని ఆ కాలమునకు పూర్వమందు గాని, పరమందు గాని రేడియో వద్ద కూర్చుండినను మనకు రేడియో ధ్వని వినిపించదు గదా! యోగమనగా కలయికయని అర్థము. పగలు రాత్రి కలయిక సాయం సంధ్యా కాలము. రాత్రి పగలు కలయిక ప్రాతస్సంధ్యా కాలము. జీవాత్మ పరుమాత్మల కలయిక యోగము. దానిని సాధింపదలచి ఆ సమయమునందే జీవపరమాత్మల యోగ (కలయిక) సాధన మొనర్పవలయును. కాని యోగులు యోగమును సాధించుకాలమది. కాన జీవాత్మను పరమాత్మతలో అనుసంధానము చేయుటకు అర్హమైన కాలమని నిర్ణయించి సంధ్యాకాలములో (బ్రహ్మీముహూర్తమున) బ్రహ్మోపాసనము=ఆత్మోపాసనము= సంధ్యోపాసనమును మన పూర్వులు మనకు విధించిరి. ఇది చీకటి- ఇది వెలుతురు, అని ఈ రెండింటిని తెలుసుకొను తెలివియే జ్ఞానము. దృష్టిని జ్ఞానమయముగా చేసి దృశ్యమగు జగమును బ్రహ్మాకారమును చూచు నభ్యాసము చేయతగిన కాలము అది. అనగా జీవాత్మను పరమాత్మతో యోగము= కలయిక= చేర్చుటకు అభ్యాసము చేయుటకు తగిన ముఖ్య కాలమది అదియే సంధ్యా కాలము. ఆ కాలములో చేయతగిన ధ్యానక్రియాకలాపమే సంధ్య= సంధ్యోపాసన= సంధ్యావందనము= సంధ్యోపాసి యనంబడును. స్వప్నమున జాగ్రదవస్థవలెనే వస్తుప్రత్యక్షము లేకున్నను వస్తుస్వరూప సాక్షాత్కారమును అనుభవమును కలిగించుచున్నది. సుషుప్తివలె శరీరము భాహ్యేంద్రియములు పని చేయక ఒకచోట నిశ్చలముగ పడియున్నది. కాన జాగ్రత్సషుప్తుల రెంటి లక్షణములు కలిగినది స్వప్నము. కాన స్వప్నమువలెనే జాగ్రత్సషుప్తులు రెండును కూడా పరమార్థ విచారణమున వట్టివేయని బోధపడుచున్నది. సత్య వస్తువును తెలిసికొనుటకు ఉభయ లక్షణములు గలిగిన కాలమునందే ఉపాసింపవలయును. అసత్యమైన సగుణ విధానమున ఆరాధించుచు సత్యమైన నిర్గుణ బ్రహ్మమును పొందవలయునని భావము. ఇదియే బోధకుని లక్షణము. సాధకుని లక్షణము అని పిండి తార్థము. శ్లో : అవ్యక్తాదీని భూతాని న్యక్త మధ్యానిభారత అవ్యక్త నిధనాన్యేవ కాతత్ర పరిదేవనా! భ.గీ.అ. 2-28 శ్లో స్వప్నమునందు చూచిన పులి గాని, అరణ్యముగాని, భయము గాని మున్నగు విషయములు స్వప్నస్థునకు గలుగుస్వప్నానుభవము స్వప్నమునకు పూర్వము జాగ్రదవస్థా సమయమున కానరాకపోయినది. మఱియు స్వప్నావస్థా నంతరమున గాఢ సుషుప్తి సమయమున, స్వప్న ప్రపంచానుభూతి కానరాదయ్యెను. జాగ్రత్సుషుస్త్య వస్థల నడిమి కాల మున కాననవచ్చెను ప్రత్యక్షమైన బాహ్యేంద్రియ మగు నేత్రమును తెరువగనే స్వప్నముగాంచిన పులి, అడవి, భయము కానరాదయ్యెను. కాన స్వప్నము వట్టిదని స్పష్టముగ తెలియుచున్నది. ఈ విషయము జాగ్రదస్థ యందు తెలియుచున్నది. కాని స్వప్నమునందు కాంచిన విషయములప్పుడు స్వప్నానుభవమందు స్వప్నస్థ పురుషునకు నిజమనియే తోచినవి. కాని కను విప్పినపుడు జాగ్రదవస్థలో స్వప్నానుభవము దబ్బరయని బోధపడుచున్నది. భూతములు అనగా సర్వ విధ దేహములు ఆద్యంతములు కానరాకయున్నవి. అనగా ఎట్లు జనించుచున్నవో ఎట్లు నశించుచున్నవో తెలయరాకున్నది. మధ్య కాలములో నాటకములో వేషమువలెను, సినీమాలో తెరమీద బొమ్మవలెను కానవచ్చుచున్నవి. మధ్య కలిగిన భాగ్యమునకు గర్వపడనేల? నశించెనని దుఃఖింపనేల? ఇది యంతయు అజ్ఞానవిలసితము. మధ్య కనుపించెడి శరీరము కలిగెనని సతోషం పోయెనని విచారము పనికి రాదు సుమా! అటులే పుట్టుటకు పూర్వము శరీరము కానరాదు. మరణమునకు పిమ్మట గూడ శరీరము అగ్నిదగ్ధమై గాని, భూమి యందు ఖననమైగాని కానవచ్చుట లేదు. జన్మించిన పిమ్మట మరణమునకు పూర్వము కనిపించిన శరీరము, స్వప్న శరీరము వంటిదని, తెలియదగును. జాగ్రదవస్థలో కనుపించెడి శరీరము దీర్ఘ స్వప్నము నందు గాంచుట వంటిది. వ్యవహారము నందలి నిజమైన అనుభవ స్వప్నము ఎప్పుడో ఒకప్పుడు గంటయో రెండు గంటల కాలమో నిద్రాసమయమున కనుపించవచ్చును. ప్రతి దినము నిద్రలో స్వప్నము రావలయునని, నియమము లేదు. జాగ్రదవస్థ యనెడి దీర్ఘ స్వప్నము (జాగ్రత్స్వప్నము) ప్రతి దినము కలుగుచుండును. జాగ్రదవస్థయను స్వప్నము నలుబది లేక అరువది లేక ఎనుబడి వత్సరాల కాలమో అనుభవింతుము. అది దీర్ఘస్వప్నతుల్యమైనదని ఎరుంగుము. అట్టి స్వప్న శరీరమునకు గాను విచారింప తగదు సుమా! శరీర=దేహీ=ఆత్మ నిత్యమైనది. అది పట్టునది, చచ్చునది కాదు కనుక దానికై పోయినదని విచారించుట అవివేకము. పోవునది శరీరము కాని శరీరి=దేహి=ఆత్మ మాత్రము పోవునది కాదు. ఆత్మనిత్యుడు, సర్వగతుడు, స్థాణువు, అచలుడు, సనాతనుడు, నిర్వికారుడు, నిరవద్యుడు, నిర్లిప్తుడు, నిరంజనుడు ఎచటికిని పోవనిది ఆత్మ అది చర్మ చక్షుస్సులకు కానరాదు. పోవునది శరీరము. అది ప్రత్యక్ష బహిరింద్రియములగు చర్మ చక్షుస్సునకు గోచరించునది. అనగా ప్రత్యక్షముగా కనిపించు అనిత్యమైనది. అశాశ్వతమైనది. అని బాగుగా (నెఱుంగ) ఎఱుగబడు చున్నది. కావున సంసారము= జగత్తు=శరీరము దీర్ఘస్వప్న సదృశమని మరువ రాదు. స్వప్నము జాగ్రత్సు షుప్తులకు సంధి. కాన సంధ్య దివారాత్రముల రెంటి లక్షణములు గలిగి జీవాత్మ పరమాత్మల అనుసంధానము చేయతగిన కాలమని తెలియవలయును. మనము పుట్టుటకు పూర్వము రాజ్యము=ఎస్టేట్ లేదు. చచ్చిన పిమ్మటను లేదు. రాజ్య సంపద మనతో గూడ మన వెంట పుట్టనూలేదు. మనతో గూడ అనగా మన శరీరముతో గూడ పోనూలేదు. మన వెంట రాదుగదా! మనకు మధ్య కాలమున ప్రాప్తించి, రాజ్యము లభించెనని సంతోషము గాని, ఎస్టేట్లు ప్రభుత్వములో కలిసిపోయేనని విచారము గాని ఏల? అవసరము లేదు. ముస్లిముల పాలనమునందు గాని, హూణుల పాలనమునందుగాని, వారికి పూర్వము దేశము నందుగల హిందూ - ఆంధ్ర రాజుల కాలమునగాని లేని క్రొత్త విప్లవము వచ్చి, ఆధునిక రాజ్యము స్వాధీన పఱుచుకొని ఆవిరి అగునట్లు చేసెను. దీనికై విచారింప పని లేదు. మనదుఃఖము నార్చు వారును, తీర్చువారును లేరు. విచారించిననూ ప్రయోజనము కానరాదు. ''కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతింబొందరే. వారేరీ సిరి మూటగట్టుకొని పోవం జాలిరే, భూమిపై పేరైనం గలదే'' అని బలి పలికిన, పలుకులను, వినమా? భగవాను డొసంగిన జ్ఞాన స్వారాజ్యమును కోలుపోదుమని మాత్రము విచారింపక తప్పదు. ఆ విచారము మేలును కలిగించును. ఇతర విచారములు ఆరోగ్యమును భంగపఱచును. బుద్ధిని నశింపచేయును. జీవుని పతనము చేయును. పరమార్థమునకు దూరమగును. ''బుద్ధి నాశాద్వినశ్యతి.'' భ.గీ మనము పుట్టుటకు పూర్వము లేని భూమిని తండ్రి సంపాదించెను. మనము పుట్టిన పిమ్మట అప్పుల తీర్మానమునకై భూమి విక్రయింపబడెను. మధ్యవచ్చిన భూమికై సంపాదించినపుడు సంతోషము గాని, పోయినపుడు విచారము గాని పొందవలసిన పని ఏ మాత్రము లేదు. భూతము లెటనుంచి వచ్చెనో కాని అది తెలియదు. ఎచటకు, ఎట్లుపోయెనో వాని అంతము తెలియబడదు. నడుమ కానవచ్చును. మధ్యంతర ఎన్నికలవలెను, నడిమంతరపుసిరి వలెను, మధ్యనేర్చిన తెలివి వలెను, చచ్చుటకు ముందు గలుగు చావు తెలివి వలెను, ఉన్న దేహములనుగాంచి వానిని గూర్చిన పరిదేవన మెందులకు? అని గీతాచార్యులు తెలిపిరి. మఱియు సంధ్యయన స్వప్నావస్థను పోలియుండును. ఇది ఇహపరలోకములకు సంధియందున్నది. కాన సంధ్యనామముతో నొప్పారుచున్నది. ఇహలోకమున నున్న వస్తు జాలమును ఇంద్రియ వ్యాపారములచే నెరుంగుటకు శక్యమగు నవస్థ జాగ్రదవస్థ-ఇహలోకము. వస్తు సాక్షాత్కారము ఉండియు, బాహ్యేంద్రియ వ్యాపారములు లేని స్థితి కాన స్వప్నావస్థ జాగ్రదవస్త కానేరదు. కాక ఇహలోకమునూ కాదు. సర్వేంద్రియములు లీనమై కారణ మాత్రావశేషమై యుండుట చేతను, జాగ్రదవస్థ (యందు) యును మరల అందుండియే అభివ్యక్త మగుటచేతను, సుషుప్త్యవస్థ పరలోక మనం బడును! పరలోకముగూడ సర్వ విలయ స్థానమనియు, సర్వోత్పత్తి కారణమనియు, స్పష్టముగా తెలియును గదా! ఈ హేతువుచే స్వప్నావస్థ పరలోకము కాదు. అందును కర్మలకు సంబంధించిన ఇంద్రియములు లేకున్నను, జ్ఞానేంద్రియములున్నవి గదా! కాన ఈ స్వప్నావస్థ యీ రెండు లోకములకును నడుమనున్నది. అని భావము, నిస్సంశయము. కాన ఈ సంధ్య యనెడి స్వప్నావస్థ యందు ఇహలోకానుభవములు కలుగు చుండును. పర లోకానుభవములు కలుగు చుండును. కాన ఇహ పరలోక వాసనలు కలిగి యుండుటచే ఉభయ లక్షణములతో నొప్పుచుండుటచే స్వప్నమునకు సంధియను నామ మొప్పెను. సరే-అయితే- సంధిలో ఇహపరలోక సంబంధమగు వాసనలు గలుగుటకు హేతువు కలదు. కాని ఇహ లోకానుభవములు గలిగిన జీవునకు గల మనస్సునకు ఇహలోక వాసనలు గలుగునన చెల్లును. కాని పరలోక వాసనలు ఎట్లు కలుగును? అను సంశయము గలుగక మానదు. శ్లో|| బహూని మేవ్యతీతాని జన్మాని తన చార్జున. చ.గీతా ప్రమాణమునను, శ్లో. జాతస్యహిధృవో మృత్యుః ధ్రువం జన్మ మృత స్వచ. చ.గీతా ప్రమాణమునను, జీవునకు జనన మరణ రూప ప్రవాహమున అనేక పుట్టుకలు, అనేక మరణములు గలుగుచు, అనగా అనేక శరీరములు వచ్చుచు, పోవుచు నుండును-అని తెలియచున్నది శరీరమున ప్రవేశించుటయే జననము. శరీరమును వదలుటయే మరణము. శరీరమును వదిలిపోయినపుడు జీవుని ఉత్తమ, మధ్యమాధవ సంస్కారముల ననుసరించి పరలోకమునకు పోవుటయు, అచట జీవుని సంస్కారానుగ మైన అనుభవములు గలుగు చుండును. పిమ్మట ''క్షణ పుణ్యమర్త్య లోకం విశంతి'' అను ప్రమాణమునను, ''శుచీనాం శ్రీమతాంగే హేయోగ భ్రష్టో7భిజాయతే'' అను ప్రమాణము వలనను, జీవుని పుణ్యమో, పాపమో, ఆ సంస్కారానుభవము క్షీణింపగనే మరల భూలోకమునకు వచ్చి మరియొక శరీరమున, ప్రవేశించు చుండును. కాన పర లోకానుభవము గూడ సంధ్యయగు స్వప్నమున వాసనా రూపమున కలుగుటకు అవకాశము గలుగు చుండెనని తలంపవలెను. కాన ఇహ పర ఉభయ లోకాను భవములు స్వప్నమను సంధ్య యందు కలుగు చుండునని సువ్యక్తమగు చున్నది. స్థూల శరీరము ఇహ లోకమున సంచరించు చుండును. కనుక ఇహ లోకవిషయములన్నియు స్థూల శరీరాభిమానియగు విశ్వునకు తెలియగలవు. కాని సూక్ష్మ (లింగ) శరీరము పరలోకమున గూడ సంచరించుచు వచ్చి శరీరమున చేరుటచే సూక్ష్మ శరీరమునకు పరలోక వాసనలు గూడ తెలియుటచే ఇహ పరలోకముల అనగా ఉభయలోక వాసనలు ఆ సూక్ష్మశరీరాభియగు తైజసునకు తెలియగలవు. ఆ సూక్ష్మ శరీరము స్థూల శరీరమున ప్రవేశించుటచే నిస్సంశయముగ జీవునకు ఇహ పరలోక వాసనలు కలుగు చుండును. అని రూఢియగు చున్నది. ఆ చైతన్యమునకు (బుద్ధి) ప్రతిబింబమే జీవుడు గనుక ఇహ పరలోక వాసనలు తప్పక కలుగునని ఎరుగ వలయను, ఆ చైతన్య ప్రకాశము మనస్సు మీద ప్రసరించి వెలుగొందగనే మనస్సునకు ఆ రెండు లోకములగు ఇహపరలోక వాసనలు స్వప్నమున మనస్సునకు స్ఫురణము తప్పకుండ, గలుగుచుండునని తాత్పర్యము. కాన యీ లోకమున, సంసారమున గలుగు కష్ట సుఖమును తలంపునకు రానీయక మనస్సునకు మరపుకలుగునట్లు మంత్రానుష్ఠానము కల్పించి, ఈలోక వ్యవహారముల యందు కొంత తడవు ఆసక్తిని, అనురక్తిని విరమించి, పరలోక సంబంధమైన పారమార్ధిక చింతనమున, నిమగ్నమగుటకు యత్నించ తగిన ఈ సంధ్యాధ్యానము= సంధి= స్వప్నము వంటిది. అనగా మెయిమఱచి యుండు సుషుప్తియు గాదు. మేను తెలిసిన జాగ్రదవస్థయు గాదు. జాగ్రత్సుషుప్తులకు నడుమనున్న (తెలిసియు తెలియని ఒక అవస్థ) స్వప్నము. కనులు మూయుటయు కాదు కనులు తెఱచుటయు గాదు. అర్ధనిమీలిత నేత్రదృష్టితో మెలగుట యోగసాధనము. కనులు మూసితిమా? కాదు. నాసాగ్రమున నవలోకించుట జరుగుచుండును. కనులు తెఱచితిమా? యనినచో, లోకమున జరుగు వ్యవహారము కానరాదు. కారణము! కనులు మూసిన ఎడల నిద్దురవచ్చి ఆవరించును. కాన కనులు తెఱచి నాసాగ్ర భాగమున దృష్టిని నిలిపి నాసాగ్రమును మాత్రమే కాంచుచుండవలయును. కనులు తెఱచితిమా? లేదు. కనులు తెఱచిన ఎడల బహిఃప్రపంచ దృశ్యజాలము కనుపించును. కాన అర్ధనిమీలితముగా నుంచుటయే యోగసాధనకు ముఖ్యోపాయము. యోగ సాధనమునకు ఆ విధముగా కనులు మూసియు, మూయకయు, కనులు తెఱచియు, తెఱువకును, చూచియు, చూడకను, తెలిసియు, తెలియకను, యోగులు యోగ సాధనమును చేయుచుందురు. ఇట్లు చేసిన యోగిరాట్ అగును. 1 నూలపిచ్చమ్మగారు.2 కొత్తలంక యోగి, కుండలేశ్వరము. 3 నిష్టల ప్రకాశము 4 నాగమహాశయుడు 5 వారణాసియందు గంగానదిలో పడవ మీద ఊయలలో పరుండిన యోగి. 6 పెనుమత్స యోగిని-7 మాతాజీ 8 జిల్లేళ్ళమూడి అమ్మ. 9 రమణమహర్షి 10 అరుణాచలము, రాఘవేంద్ర స్వామి మంత్రాలయము 11 బాలయోగి, ముమ్మిడివరము. మున్నగువారు యోగసాధకులై దిగంబరులై వెలుగొందుచుండిరి. అట్లే ఇహలోక వ్యవహారములను, విరమణము, పరలోక సుఖానుభవమునకు యత్నించుటయను రెండు పనులను చేయదగిన కాలము సంధ్యోపాసన కాల ధ్యానము జాగ్రత్సుషుప్తులస్థితి కానిది స్వప్నము. అట్లే ఇహపరలోకములు స్థితి కానిది సంధ్యోపాసనము. ''రెంటికిం జెడిన రేవడి నైతిని'' అన్నట్లు భావింపతగదు సుమా! ఇహపరలోక సౌఖ్యములకు సాధన భూతమైనది సంధ్యోపాసనము, అని తాత్పర్యము. అట్టి సంధ్యోపాసనమును చేయుచు, అందు గాయత్రీ మహామంత్రానుష్టానమును చేసి, ఇహపర సౌఖ్యముల గాంచుడని ద్విజాళికి ఇదియొక ముఖ్య ప్రబోధము చేయబడు చున్నది. ఆర్యా : ఇచట ఇందు విషయమొక ఆశంక కలుగుచున్నది. ఏమన 1. ఆయ్యా! స్వప్నము. మిధ్య- దబ్బర-పట్టిది- మృష- అబద్ధము- హుళక్కి- కల్ల- అనృతము- అసత్యము అని ఏమేమో పలుకుచుండిరి. ఆది శంకరాచార్యుల వారి తలిదండ్రులకు ఆర్యాంబ- శివగురు భట్టులగు మహాభక్తులకు పరమశివుడు స్వప్నమున సాక్షాత్కరించి సంతానము కొరకు మీరు తపం బొనర్చుచుండిరి. కనుక మీకు అల్పాయుష్కుండగు సత్పుత్రుడు కావలయునా? చిరాయుష్మంతుడగు గుణహీనుడు కావలయునా? యని యడగ శివగురుని కోర్కెపై మహాదేవుడు సత్పుత్రుని పడయుడని వరంబొసంగి యంతర్హితుండయ్యెను. శంకరుని కృపవలన కలిగిన కుమారునకు ''శంకర'' నామకరణమును చేసి తల్లిదండ్రులు సంతోషించినట్లు చరిత్ర వలన తెలియ చున్నది. కాన స్వప్న ఫలసిద్ధి గదా! 2. ఇట్లే మృకండుడును, మరుద్వతియు గోమతీ తీరమున తపం బొనర్చి స్వప్న సదృశతపంబున ఈశ్వర సందర్శనమయి సత్పుత్రుని కరంబుగా బడసినట్లు పురాణ గాథలు తెలుపుచున్నవి. 3. మరియు మహారాష్ట్ర రాజ్య స్థాపకుడగు శివాజియను చక్రవర్తి జననమునకు పూర్వము, వాని తల్లిదండ్రులు ధ్యాన నిమగ్నులై నిద్రించు సమయమున పుత్ర సంతానము కలుగునని స్వప్నమున భగవానుడు వరం బొసంగినట్లును, పిమ్మట పుత్ర సంతానము కాంచి నట్లును, శివుని అనుగ్రహమున పుత్రుడు జనించుటచే, ఆ శిశువునకు తల్లిదండ్రులు ''శివాజి'' యని నామకరణము చేసినట్లును, అతగే శివాజి యను పేరుతో చక్రవర్తియైనట్లును చరిత్ర చాటుచున్నది. కానస్వప్నం యథార్ధమై ఫలించెను గదా! 4. వేములవాడ భీమకవియొక్క తల్లి చిన్న నాటనే భర్త మృతి నొందుటచే బాల వితంతువుగా నుండెను. ఆమె భీమేశ్వరుని గూర్చి ఆలయమున కేగి నీవంటి పుత్రుడు నాకు కలుగునట్లు అనుగ్రహించుమని కోరెను. భీమేశ్వరుడు స్వప్నమున సందర్శించి నీకు నావంటి పుత్రుడు జనించునని వరం బొసంగెను. ఆ వర ప్రభావమున ఆ బాల వితంతువునకు కొంత కాలమునకు పుత్రుడు జనించెను. వానిని వేములవాడ భీమేర్వుడని తల్లి పిలువంజొచ్చెను. అతడే వేములవాడ భీమకవియని ప్రసిద్ధిగాంచెను. ఆతని చరిత్ర కలదు. వాని మహిమలు బహుళముగ చెప్పుచుందురు. ఇట స్వప్నఫలము ప్రత్యక్షముగా కలిగెను గదా! 5. మఱియు అశ్వపతి మహారాజ వరపుత్రియగు సావిత్రి తనకు స్వప్నమున కనుపించిన సత్యవంతుని వివాహమాడెను. అతని తలిదండ్రులు గ్రుడ్డివారలు. రాజ్యమును కోలుపోయి అడవుల పాలయ్యెనని తెలిసియు, స్వప్నమున వరించిన వరుని మాత్రమే పరిణయమై నారదుని వలన అల్పాయుష్కుడని తెలిసియు, వివాహమై యముని వెంబడించి భర్తను సంపాదించుకొని బ్రతికించుకొనెనని పురాణగాధలు వినిపించుచున్నవి. స్వప్నము ఫలించెను గదా! 6. ఒకనికి ఒక జ్యోతిష్యుడు స్వప్నమున కనుపించి రేపు నీకు ఉద్యోగము లభించుననియు, ఉత్తరువులు వెంటనే వచ్చుననియు తెలిపెను. ఆ స్వప్నమును కలిగిన మరు దినమునందే టపాలో ఉద్యోగపు టార్టరు అంది, ఉద్యోగమున ప్రవేశించి సుఖంబుగ మోదమందెను. ఇది స్వప్నము ఫలించుట గదా? 7. ఇంకొకడు స్వప్నమున తాను వ్రాసిన పరీక్షలో తాను కృతార్ధుడయినట్లునూ సబ్జక్టు వారిగా మార్కుల లిస్టు కంటికి కానవచ్చెననియు తెలిసెను. పరీక్షా ఫలితములను పత్రికా ముఖమున కృతార్థుడైనట్లు తెలిసిన పిమ్మట స్కూలునందు మార్కుల మొత్తమును కలిపిన యావరేజి మార్కు జయోక్తి పత్రిమున కాననయ్యెను. ఇది స్వప్నఫలము కదా? 8. శ్రీ వాల్మీకిమహర్షి మన కనుగ్రహించిన ఆది కావ్యమగు శ్రీ మద్రామాయణమున సీత అశోకవనియందు రాక్షస స్త్రీల భీతికర వాక్యముల వలన వ్యధ పడుచుండుగా త్రిజట నిద్దుర మేల్కాంచి తాను రావణుడు నూనెను దేహమునకు పులుముకొని దక్షణి దిక్కుగా గార్దభవాహనుడై పోవుచున్నట్లును, శ్రీరాముడు రావణుని జయించి, సితను విమానముపై నెక్కించుకొనిపోయి అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యెననియు, స్వప్నము కాంచెనని రాక్షస వనితలకు తెలిపి, సీతను ఓదార్చి లంకకు చేటు కలిగెనని తెలిపినట్లు గాధ కలదు. ఇది స్వప్నఫలము కదా. ఇట్టి శాస్త్రానుభవములు బహుళముగా మా శ్రవణాను భవమున కలవు. స్వప్నము తధ్యమనియే నా విశ్వాసము-అనువారు కొందరు కలరు వారికి యీ క్రింది సమాధానములీయ బడుచున్నవి. నాయనలారా! I స్వప్నశాస్త్రము అందు I సుస్వప్న ఫలములు 2 దుస్వప్న ఫలములు అను విభాగ ద్వయముతో అలరారుచున్నది. II కలలు వాని ఫలములు అను రూ10 వెలగల గ్రంధమొండు ఇటీవల ప్రకటితమైనది. III శకున శాస్త్రము నందు 1 సుశకునములు 2 దుశ్శకునములు అను భాగద్వయాత్మకముగ వెలయుచున్నది. IV అంగశాస్త్రము. V సాముద్రికమును హస్త రేఖా శాస్త్రము. VI వాస్తు శాస్త్రము=గృహసృష్టి=నివాస నిర్మాణము అను 40 రూ, వెలగల గ్రంధము ఇటీవల ప్రకటితమైనది. లక్ష్మీవాస్తు-రామరాయ వాస్తు-గుప్త వాస్తు-నేవ రానివాస్తు-వేంకటేశ్వర వాస్తు-నారాయణీయ వాస్తు- మయవాస్తు- కృష్ణవాస్తు మున్నగునవి ఎన్నియో విలసియున్నవి. జ్యోతిషశాస్త్రము అందు 1 జాతక భాగము 2 ముహూర్తభాగము 3 పంచాంగ గణిత భాగము అను స్కంధత్రయములతో ప్రకాశించు చున్నది. ఇంకను పురాణములందు తిలక-పిడక-చిహ్న- పుట్టుమచ్చల శాస్త్రముగూడ తెలుపబడినది. ఈ శాస్తములన్నియు ''అపరావిద్య'' యనబడును. ఇవి జ్ఞాన సముపార్జనమునకు సాదన భూతములుగా నున్నవి. తత్త్వశాస్త్ర మొక్కటియే బ్రహ్మవిద్య- రాజగుహ్యవిద్య ''పరావిద్య'' పరమార్థవిద్య యనబడుచున్నది. జ్ఞానము= తత్త్వశాస్త్రము= పరావిద్య కలిగిన తోడనే ఏ శాస్త్రములతోను ప్రసక్తియే యుండదు. యేది సత్యమో దానిని సాధింపుమని పైంగలోప నిషత్ పలుకుచున్నది. మేధావియగు పురుషుడు గ్రంధముల నభ్యసించి, సేద్యగాడు తాలును, పొల్లును, పదవి గట్టిగింజలను పరిగ్రహించు విధమున, వాని సారమును గ్రహించి గ్రంధ సముదాయమున పదపాంశువునువలె పరిత్యజింపవలయునని అమృతబిందు- త్రిపురాతాపినీ- బ్రహ్మ విద్యో పనిషత్, మున్నగు ఉపనిషచ్ఛాస్త్రములు పదే పదే తెలుపుచున్నవి. బ్రహ్మ విద్యోపనిషత్- ''వేదశాస్త్రాణి చాన్యాని పదపాంసు మినత్య జేత్'' అని కలదు, విహాయశాస్త్రజాలాని యత్సత్యం తదుపాస్యతాం'' పైంగలోపనిషత్ - అని కలదు. 1 మొదటి జామున అనుభవింపబడిన స్వప్నము ఒక సంవత్సరమునకును 2 రెండవ జామున వచ్చిన కల తొమ్మిది మాసములకును, 3 మూడవ జామున కనిన స్వప్నము ఆరు మాసములకును, 4 నాల్గవ జామున కలిగిన కల మూడు మాసములకును లేక ఒక నెలలోపు గను, 5 తెల్లవారుచుండగా వచ్చిన, ఆరుణోదయమున కనిన స్వప్నము నిద్దురను మేల్కాంచిన వెంటనే ఆదినమునందే కాని, లేక వారము దినములలోపుగా గాని, ఫలముల నొసంగునని స్వప్న శాస్త్రము ఫలములను తెలియజేయు చున్నది. సర్పము, ఎనుము, వరాహము (అడవి పంది=ఏదుపండి) రాసభము మున్నగు క్రూర జంతువులను దర్శించినను తైలమును దేహమును పూసికొననట్లుగాని, ఆముదము, నిప్పు, ఇనుము, ఎముకలు, కనిపించుట, ఇల్లు కూలుట, మురికి నీరు చూచుట, త్రాగుట, బురదలో జారిపడుట, ఇట్టి స్వప్నములు దుష్ఫలితము నొసంగును. కారాగృహాది నివాసములు గలుగును. రైలు పడుట, తుపాకీ ప్రేలుట, మరణవార్తా శ్రవణము, నిద్దురలో దుఃఖించుట, క్షురకర్మ చేసికొనుట, వైద్యుని గాంచుట, కోతిని చూచుట, పశుమాంసాహారమును గైకొని భజించుట, ఇట్టి స్వప్నములు, ధనహానిని, దారిద్ర్యమును, రోగములను , ఆపదలను గలిగించును. ఇట్టి దుస్స్వప్నములను గాంచినపుడు మేల్కాంచి పాద ప్రక్షాళనమును, నేత్రములను జలముతో తుడిచి, ఆచమనమును చేసి, మరల పరుండి నిద్రించిన కొంత కష్ట నివారణమునకు హేతువగును. ''సహస్ర పరమందేవీ శతమూలా శతాంకురా సర్వగ్‌ంహరతుమే పాపం దుర్వాదుస్స్వప్ననాశినీ'' అని స్మరించి పరుండినచో ఆ పన్నివారణము కలుగును అని నియమము కలదు. సుస్వప్నముల గాంచినపుడు నిద్దుర మేల్కాంచి శుచియై, బ్రాహ్మణవందన మొసరించి స్వప్నవృత్తాంత మెరింగించి, వారి ఆశీస్సులను స్వీకరించవలయును. దివా (పగటి) స్వప్నములు (కలలు) కష్ట, నష్ట, దుఃఖ, ఫలరహితములు. వాటికి భయము చెందనక్కలేదు. రాత్రి స్వప్నములు మాత్రము ఐహిక ఫలప్రదములు అగును. ఇహఫల దాయకములు కాగలవు అని శాస్త్రములు తెలుపును. ఈ స్వప్నములు ఐహికముగా సత్యములు కావచ్చును. కాన వ్యావహారిక సత్యములు అగును. కాని పారమార్ధిక సత్యము లెంతమాత్రము కానేరవు. ఇదియే మనము ముఖ్యముగ గమనింప తగియున్నది. ఐహికములగు ఆలు బిడ్డలు ఇల్లు వాకిలి, తోట, దొడ్డి, భూములు, పిల్లలు జల్లలు, బంధువులు, మున్నగునని అన్నియు, దీర్ఘస్వప్నమువలె రిత్తయే యగునని వేదాంత శాస్త్రము ఘోషించు చున్నది. ఇట్లు శాస్త్రవాక్కులు బోధించుచుండ ఐహికములగు మార్కులు, ఉద్యోగములు, జీతములు, ఖాయములు, ఇంక్రిమెట్లు, పర్మనెంట్లు, ప్రొమోషనులు, పుట్టుకలు మరణములు ధన సంపాదనములు, సంతానము, ఐహి కైశ్వర్యములు స్థిరమైనవా? కావు గదా! సత్యమైనవా? కావు గదా! భూత భవిష్యద్వర్తమానములందును చలనము లేక నుండువది స్థిరమైనది. అదియే సత్యశబ్దమునకు సరియగు అర్ధముల నోసంగును వ్యవహార సత్యములే కాని పారమార్ధిక సత్యములు మాత్రము కావు. అని గురు-వేదాంత-శాస్త్ర వ్యాక్యముల వలన మనకు స్పష్టముగా బోధయగు చున్నది. శబ్ద జాలమును, గురు పుంగవుల బోధలును, తెలియని పరమార్ధమును తెలిసికొనుటకు ఏర్పడినవే కాని, తెలిసిన పిమ్మట గరువులతోను, సద్గ్రంథావళితోను ఏ మాత్రము పని=ప్రయోజనము లేదు. రోగ నివారణమైన పిమ్మట వైద్యునితోను, నదీ తరుణమైన పిమ్మట నావ=పడవతోను తెప్పకొయ్యతోను, వారధి=వంతెనతోను, ప్రయోజనములేని విధమున, గురువులునూ గ్రంధములును ప్రయోజన రహితములగును సుమా! శ్లో|| గ్రంథమభ్యస్య మేధావీ జ్ఞాన విజ్ఞాన తత్పరః పలాలమివ ధ్యానార్థీత్యజేద్గ్రంధము శేషతః త్రిపురాతాపిన్యుపనిషత్ - అమృత బి.దూపనిషత్ శ్రద్ధ, మేధ, ప్రజ్ఞ, బుద్ధిగల వివేకవంతుడు గ్రంథ సముదాయమును సేకరించి, పఠించి, అందలి సారమును గ్రహించి, గ్రంథ సంపదను వదిలివేయవలయును. ఎట్లన గట్టి ధాన్యపు గింజల నభిలషించు సేద్యగాడు చేటలతో ధాన్యము గాలిలో ఎగుర పోతపోసి, తాలు ధాన్యమును, పొల్లును వదిలి మంచి గట్టి ధాన్యమును స్వీకరించును గదా! ప్రహ్లాదుడు ''చదువులలో కెల్ల సారము చదివితి తండ్రీ'' అని తండ్రితో పలికెను. విద్యలలోని సారమును గ్రహించి గ్రంథములలోను ఇతర విషయముల చదువ నొల్లడయ్యెను. జ్ఞానమును, విజ్ఞానమును, ప్రజ్ఞానమును, సుజ్ఞానమును, సంజ్ఞానమును కనుగొనిన వారలకు గ్రంథములతో ప్రసక్తియే యుండదు సుమా! శతాధిక గ్రంధ రచనముల కంటెను, సహస్రాధిక గ్రంధ పఠనములకంటెను, అయుతాధిక గ్రంధ ప్రబోధముల కంటెను, న్యయుతాధిక గ్రంధ పరిశీలనముల కంటెను, అనుభవ జ్ఞానము గొప్పది. కావుననే బ్రహ్మచర్య-గా ర్హస్థ-వాన ప్రస్థములలోని స్వానుభవములను సముపార్జించి, సన్యసించిన బాల్య¸°వన, కౌమారుములను గడపిన వృద్ధుడు (వార్ధక్యమున) గురుస్థానమునకు అర్హుడు. ప్రబోధమున చేయుటకు (వయస్సు=వార్ధకము, ఆశ్రమము, పూజనీయము) అర్హుడు అని శాస్త్రములు చాటుచున్నవి. ఈ అధ్యాత్మ తత్వబోధకు బాల్య¸°వన కౌమారములలోని వారలు సాటిరారని శాస్త్రములు బోధించుచున్నవి. 1. దక్షిణామూర్తి ''వృద్ధా శిష్యాః గురుర్యువా'' 2. ఆది శంకరాచార్య జగద్గురువరేణ్యులు 3. ప్రహ్లాదుడు 4. ధ్రువుడు 5. దత్తాత్రేయ గురువరేణ్యులు- బాల్యముననే గురువులుగా నుండలేదా? అనవచ్చును. అది ''ఏతావానస్యమహిమా'' పరమాత్మ యొక్క మహిమము ఆ విధమైనవి సుమా! అని అవతార మహిమలను తెలుపుటకు ఏర్పడినది సుమా! లేనిచో వారు అవతారమూర్తులని మనము గ్రహింపజాలము గదా! అనుభవము లేని గురువు వలన లోకము చెడిపోవును. తప్పదు. వృద్ధవైద్యము గొప్పది. మేలును కలుగచేయును. వృద్ధుల ఉపదేశములు వృద్ధికరములు. పెద్దలమట- చలిదిమూట అను నార్యోక్తి వ్యర్థము కాదుసుమా! ఆశ్రమానుసారముగ క్రమముగా రాని వాని మాటల, బోధల వలన దేశమునకు చేటువచ్చును. నిశ్చయము సుమా! బాటసారుల, యాత్రికుల యొక్క ఉపయోగమునకై సత్రవును నిర్మింప వలయునని గాని, భక్తి ప్రబోధమునకై దేవతాయతనము నిర్మింప వలయునని గాని, యొకడు సంకల్పించ వచ్చును. ఏవియో కారణాంతరములచే కట్టించలేకపోవచ్చును. మంచి పనులను చేయతలచిన వానికి మంచి ఫలములు గలుగవచ్చును. చెడు పనులను చేయతలంచిన వానికి చెడు ఫలములు గలుగవచ్చును ఎట్లన- ''కాశి కాశీతి కాశీతి త్రివారంయః పఠేన్నరః| స్కో7పి దేశాంతరస్థో7పి కాశీవాస ఫలంభేత్|| అహం కాశీం గమిష్యామి తత్రైవనివ సామ్యహం| ఇతి బ్రూవాణ స్సతతం కాశీవాస ఫలం లభేత్|| ఇతి కాశీయని కాశీక్షేత్రమును ముమ్మారు స్మరించినంతనే, స్మరించిన మానవుడు దేశాంతరమున నున్నను కాశీవాస ఫలము కలుగుననియు, నేను కాశికి బోయెదను, అచటనే గంగా స్నానము చేసి విశ్వనాథ సందర్శనము చేసి కొనుచు అచటనే నివసింతును అనుచు పలికిన మానవుడు ఎల్లప్పుడు కాశీలో నివసించిన ఫలమును పొందగలుగుననియు, కాశీ క్షేత్రస్థల పురాణములు ఘోషించు చున్నవి. కనుక మంచిని స్మరించిన మంచి ఫలము కలుగునని తెలియచున్నది. త్రికరణ శుద్ధితో ''అహం బ్రహ్మా7స్మి'' అని స్మరించినచో కొంత వడికి బ్రహ్మమగును. కాన దేవళ, ధర్మశాలా నిర్మాణ సంకల్పకర్తకు, సంకల్ప మాత్రమున జనించిన సత్ఫలమున ముందు రాబోవు జన్మమున రాజుగా జనించు ఫలము కలుగును. ఆ పుణ్య కార్యఫలము ప్రత్యక్షముగ కట్టించుకున్నను సంకల్ప మాత్రమున, స్వప్నమున తనను ప్రజలు రాజుగా చేసినట్లును, ఏనుగు అంబారీపై ఊరేగించినట్లును మహోత్సాహమున సింహాస నాసీనుని చేసినట్లును, తాను రాజ్యపాలన చేయుచున్నట్లును, స్వప్నమున ఫలము అనుభవించునేకాని ప్రత్యక్షముగ ఐహిక స్థూల దేహముతో రాజ్యపాలనము చేయాజాలడు. సూక్ష్మశరీరమున తైజసనామముతో రాజ్యపాలనా ఫలమును స్వప్నమున మాత్రమే అనుభవించును. అందుచే అట్టి రాజుగానున్నట్లు స్వప్నము కలిగెను. స్వప్నప్రాయముగా తేలిపోవును గాని ప్రత్యక్ష ఫలము లేదు. ఒకడు మరియొకని హింసింపవలయునని తామసమున గలిగిన కోపావేశమున తలంపవచ్చును. ప్రత్యక్షముగ హింసించుటకు తగిన సమయము చిక్కకగాని, అట్టి అంగబలము దేహబలము, ధైర్యబలము, ధనబలము లేకగాని, అధికారుల అండలేకగాని చేయలేకపోవచ్చును. ఆ పాపకార్య సంకల్ప ఫలము ముందు జన్మమునందో, మరి యీ జనియందుననో తనను ఎవరో హింసపెట్టవలసి ఫలము కలుగును. ఆ ఫలము స్వప్నమున తనను ఎవరో శత్రువులు తుపాకీతో పేల్చినట్లును, ఖడ్గములతో పొడిచినట్లును, లేక కారాగారమున పలుబాముల నునుభవించుచున్నట్లును, సర్పముచే కఱువబడినట్లును, ఏనుగుతో త్రొక్కించబడినట్లును, స్వప్నములో ఆ పాపకార్య సంకల్ప ఫలమును అనుభవించగలుగును. ప్రత్యక్షముగ భౌతిక స్థూల దేహముతో బాధలననుభవింపజాలడు. సూక్ష్మకాయముతో మాత్రమే పాపఫలమును అనుభవించను. గొప్ప కష్టఫలములు స్వప్నమున లఘువుగా తేలిపోవునని భావము. ఇట్లే స్థూలశరీర సంకల్పములు వలన గలుగుఫలములను, స్వప్నమున సూక్ష్మకాయముతో మాత్రమే అనుభవించ గలుగును. కాని స్థూల శరీరముతో మాత్రము అనువింపజాలడు. స్థూలశరీరముతో కాయికముగాను, వాచికముగను మానిసకముగను చేయ సంకల్పించిన పుణ్యపాపకార్య ఫలములను, గౌరవాగౌరవములను, మన్ననలను, తిరస్కారములను, స్వప్నమున కాయికముగను, వాచికముగను, మానసికముగను తేలికగా అనుభవించు చుండును. ఒకడు గొప్ప ప్రభువుగానుండి స్వప్నమున భిక్షుకుడుగా నున్నట్లు స్వప్నము ననుభవించును. అతడు నిద్దురమేల్కాంచగానే తన సేవకులు పండ్లు తోముకొనుటకు వలయు పరికరములను, స్నానమునకు ఉష్ణోదకమును సిద్ధపఱచియు, ధరించు నుడుపుల నందించువారును, పునుగు జివ్వాజి ఆ త్తరు పన్నీరు మున్నగు సుగంధ ద్రవ్యముల నందించువారును, ఆహారములను సమీపమునకు తెచ్చువారును, కానవత్తురే కాని, నిజముగా భిక్షను పెట్టువారులేరు. తాను భిక్షకుడుగా లేడు- ఆ రోజు తాను జన్మాంతరమున చేసిన పాప ఫలముననో, లేక ఈ జన్మముననే చేసిన అదానదోషమో, అభాగ్యపు చేష్టలో, లుబ్ధత్వముననో, భిక్షకుడుగా నుండవలసిన స్థితి కలిగినది. ఆ దుర్దశ స్వప్నమున తేలికగా మానసికముగా అనుభివించెనే కానీ ప్రత్యక్ష భిక్షుక దశను పొందజాలడు గదా! స్వల్ప పాపఫలమున స్వప్నమున భిక్షుకుడయ్యెను. గొప్ప పుణ్య ప్రభావమున ప్రత్యక్షముగ నిజమైన రాజుగానుండెను. ''ఏ తావానస్య మహిమా'' ఇది యంతయు భగవంతుని మహత్తు లేక మహిమగాక మరి వేరేమి యున్నది? నిజముగా రాజే అయి, రాజవైద్యు లెందరు ఆస్థానముననున్నను దైవికముగా వ్యాధి జనించెను. ఆ యాపత్కాలమున భార్యయో, అత్తమామలో, కుమారులో, పెద్ద తిరుమల సప్తగిరీశునకు ఏడు గ్రామములను గాని, ఏడు ఇండ్లు గాని భిక్షుకుడుగా భిక్షను స్వీకరించి, ఆ ధనమును స్వామికి అర్పించునట్లు మ్రొక్కుకొనెదరు గదా! ఆ మ్రొక్కు మహిమంబున వ్యాధి నిమ్మదించిన పిమ్మట మ్రొక్కు ప్రకారము ఆ రోజు శుచియై మేళతాళములతో ఏడు గ్రామములను సాటివారినో, ఎరిగినవారినో తన గౌరవమునకు భంగములేని విధమున భిక్షాస్వీకారమును చేసి దేవుని ఎదుట, గుడిచుట్టు పొర్లు వందనములను సమర్పించుచు మొక్కును తీర్చుకొనును గదా! తాను రాజైనను, స్వప్నమున కలిగిన భిక్షుకుని దశను యీ విధముగా మ్రొక్కురూపమున ప్రత్యక్షముగ తాత్కాలిక భిక్షుకునిగా చేయును. నిజమైన భిక్షుకుడు గాకున్నను, స్వప్న ఫలము భగవత్ప్రేరితముగా స్వప్న ప్రాయమున అనుభవించుటయే గాక ప్రత్యక్షముగ స్వల్పకాలము భిక్షుకునిగా చేయును. ఇదియే దైవ చిత్రము. రాజు భిక్షుకుడుగను, భిక్షుకుడే రాజుగను, స్వప్నఫలము ఇట్లు పరిణమింప జేయును. గొల్ల భాగవతులు రాజువేషముతో రాజుగా నటించి స్వప్నమునరాజు ఫలమును ప్రత్యక్షముగనాటకమున రాజుగా మార్పు నొందును. ఇదియే దైవమహి-నిజమున కాతడు రాజుగాదు. భిక్షుకుడు. పేదవాడు, కాని స్వప్నఫల ప్రసక్తిచే రాజుగా ప్రత్యక్షముగ, నాటకమున నటించి రాజుగా మార్పుచెందెను. దేవుడు అను న్యాయాధికారి శిక్షించిన శిక్షలు రాజు భిక్షుకుడుగను, భిక్షుకుని రాజుగను శిక్షించి తీర్పు చెప్పుచుండును. మానవుని పుణ్య పాపముల ననుసరించి స్వప్నప్రాయ ఫలములను అనుభవించును, ఇది సత్యపథము. సినీమాలలోను, భాగవతములలోను, నాటకములలోను, ఏకపాత్ర ధారణమునందున, పగటి వేషము నందును, సినీనటులు గాని, నాటకములలో రంగమార్తాండులుగాని, హరికథా కథకుడు ఒక్కడే అనేక పాత్రలను వహించుచు కథను చెప్పుటలోను, యీ స్వప్నఫలమును అనుభవించుటయే అని విశ్వసించవలయును. స్వప్నములు ఇట్లు ఐహిక దీర్ఘ స్వప్నములుగా ఫలముల నొసంగును. ఇవి వ్యావహారిక స్వప్న ఫలములు పారమార్థికమున స్వప్నము హుళక్కియే. జగత్తు గూడ స్వప్నము వలె వట్టిదేయని పరమార్థ రహస్యము గదా! ఇక స్వప్నములు-ఫలములు వట్టి వేయని చెప్పసందేహమేమి? దోషములు-నివారణము. శ్లో|| రజస్తమోమోహజాతాన్ జాగ్రత్స్వప్నసుషుప్తిజాన్| వాఙ్మనః కాయజాన్దోషాన్నవైతాన్నవ భిర్దహేత్|| ఇతివ్యాసః రజోగుణము, తమోగుణము, అవివేక మగుమోహము వలన గలిగి నట్టియు, జాగ్రత్స్వప్న సుషుప్త్య వస్థల వలన గలిగినట్టియు, మనోవాక్కాయముల వలన గలిగినట్టియు, ననవిధ దోషములను 1. ''ఆపోహిష్ఠా'' ద్యబ్లింగముల మూడు పాదములును 2. ''యోవశ్శివ తమోరసః'' అను బుక్కునందలి మూడు పాదములును 3. ''తస్మాఅరంగమానవః'' అను బుక్కు నందలి మూడు పాదములును, మొత్తము తొమ్మిది పాదములచే మంత్రపూత జలములచే మార్జనము చేసికొనుటచే, పై ప్రమాణ శ్లోకమున చెప్పబడిన తొమ్మిది దోషములు దహింపబడును. కాన సంధ్యోపాసనములోని మార్జనము (జలప్రోక్షణము) వలన గలిగెడి ఫలము (దోషనివారణో పాయములుగ) చెప్పబడినవి. ఇది సంధ్యోపాసనములోని గొప్పతనమును, మహిమను, ప్రబోధించు చున్నదని తెలయదగును. సంధ్యావందనము వలన ప్రయోజనము లేదనుకొనుట శుద్ధ అవివేక ప్రభావమే సుమా! పాపములు- నివారణో పాయములు శ్లో|| పరద్ర వ్యేష్యభిధ్యానం| మనసా7 నిష్టచింతనం| వితధాభి నివేశశ్చ| మానసం త్రివిధం స్మృతం|| పర ద్రవ్యము నందభిలాష=తృష్ణ=ఆశ. 2. ఇతరులకు అనిష్టములను కలుగచేయవలయుననెడి తలంపు=చింత=ఆలోచన 3. వ్యర్థమైన పట్టుదల=బుద్ధి మాంద్యము. ఈ మూడును మానసిక పాపములు=మనో దోషములు. శ్లో|| పారుష్యమనృతం చైవ | పైశున్యమపి సర్వశః| అనిబద్ధ ప్రలాపశ్చ| వాచికం స్వాచ్చతుర్విధమ్|| 1. పరుష సంభాషణము=నింద. 2. అనృతాలాపము=అసత్యము. 3 పరమలోభ గుణము=లుబ్ధత్వము=కఠోరత=కఠిన చిత్తము 4. అసంబద్ధ ప్రలాపము=వాచాలత. ఈ నాలుగు వాచికమగు పాపములు వాగ్దోషములు. శ్లో|| అదత్తానా ముపాదానం| హింసాచైవా విధానతః| పరదారోప సేవాచ| కాయికం త్రివిధం స్మృతం|| 1. ఇతరులు తమంత తామీయని వస్తువును సంగ్రహించుట=చోరత్వము 2. వేద విహితముగాని హింసాకృత్యము=క్రోధావేశమున ఇతరులను హింసించుట, ఆహారము కొఱకు జంతువుల హింసించుట (హింస=నొప్పించుట=చంపుట) 3. రాజద్రోహము=అంతఃపురద్రోహము, భ్రాతృద్రోహము, గురు ద్రోహము, పితృ ద్రోహము, మిత్రద్రోహము, కుటుంబ ద్రోహము, అగు పరదారలను ఉపభోగించుట=జారత్వము. ఈ మూడును కాయికపాపములు శరీర దోషములు అని వరాహ పురాణమునందు చెప్పబడి, యున్నది. పైన చెప్పబడిన మనోవాక్కాయ దోషముల సంఖ్య పదియని తెలియదగును. శ్లో. మానసం వాచికం పాపం కాయేనైవ తుయత్కృతం| తత్సర్వం నశ్యతే తూర్ణం ప్రాణాయామత్రమే కృతే|| ఇతిసంవర్తః మనోవాక్కాయములతో చేసెడి దశవిధ పాపములను (దశ) పదిపదములతో గూడిన గాయత్రీ మహామంత్రమును మనస్సుతో జపించుచు, మూడు పర్యాయములు ప్రాణాయామములను చేసిన ఎడల చిత్తశుద్ధి గలిగి శమాదులేర్పడి, మనోవాక్కాయములకు త్రివిధములచే జనించిన దశవిధపాపములును వెంటనే పూర్తిగా నశించును అని సంవర్త వచనము తెలుపుచున్నది. ప్రాణాయామమున పాపనాశనము, అరోగ్యప్రదము అగును. సంధ్యాసంకల్పములోని ''దురితక్షయద్వారా'' అని యుచ్చరించుటలోను, ఉపాత్తమగు దురి, తము క్షయించునని తెలియుచున్నది. పరమేశ్వర ప్రీతియు దురితక్షయము, సంధ్యోపాసనము వలన గలుగునని బోధింపబడుచున్నది. శ్లో. పుణ్యస్య ఫలమిచ్ఛంతి పుణ్యం నేచ్ఛంతి మానవాః| నసాపఫల మిచ్ఛంతి పాసం కుర్వంతి యత్నతః|| సర్వ మానవులు పుణ్యకార్యముల వలన గలుగు సత్ఫలమునుగోరు చుందురే గాని, పుణ్యకార్యములను జేయవలయునని ఇచ్ఛయుండదు. పుణ్యకార్యముల జోలికిపోరు. సరికదా పుణ్యము లేదు పాపము లేదు, మీ బ్రాహ్మణులు బ్రతుకుటకై మీరు వ్రాసికొనినవే ధర్మశాస్త్రములు అని అనువారలు పెక్కులుగ లెక్కకు కానవత్తురు. పాపకార్యముల వలన గలుగు యమలోక బాధలనుగాని, రాజకీయ కారాగార నివాసములుగు ఫలములను కోరరుగాని, తెల్లవారినది మొదలు పాపకార్యములను మెండుగ ఎవరి ప్రోద్బలము లేకుండగ స్వేచ్ఛగా చేయుచుందురు గదా? కాల మహిమ గదా ఇది. ఎవరితోను చెప్పకను, అడుగకను, రహస్యముగను, కడుజాగరూకతతోను, నేర్పుగాను పాపకృత్యములను చేయుచుందురు సుమా! ఇది సామాన్య మానవుల సడవడికయైయున్నది ఇక్కాలమున- 1 కవులూరు. మాచిరాజు సుబ్బారావు గారు జిల్లా రిజిష్ట్రార్. దేవుడు రిజిష్ట్రారు అని వీరికి ప్రఖ్యకలదు. 2. రాజమండ్రి సూపరెంటెండు ఇంజనీరుగారు. 3 నిర్మల్ గోవర్ధన్. శైవబ్రహ్మణ. 4 గుండుగొలను గౌడ. R.&.B, సూపర్‌వైజర్లు. వీరి జన్మాంతర సంస్కారమేమియో, అడుగకుండా ఇచ్చిన పారితోషిక రూప లంచమును గూడ పరిగ్రహించనివారు ఇట్టివారు వ్రేళ్లమీద లెక్కకు కొందరు మాత్రము వత్తురు. అదివారి పుణ్యము ''సింపుల్ హేవింగ్ హైథింకిగ్,'' వేషము స్వల్పముగను ఆలోచనము గొప్పదిగను, అనగా ఉన్నత స్థాయిగను, ఔ దార్య వంతముగను, నిజమగు (సరియగు) మానవులకు ఉండదగిన సల్లక్షణములు. ఇది సత్+దినచర్య=సద్దిన చర్యయగును. ''హై హేవింగ్ సింపుల్ థింకింగ్,'' వేషము ఉన్నత స్థాయిలోను, ఆలోచనలు నీచస్థాయిలోను, ఆచార వ్యవహారములును, భోజన భాజనములును, నీచస్థాయిలోను, కలిగియున్న వారలు ఈ కలి కాలమున మెండుగా కానవత్తురు. వీరు తమ తలిదండ్రులకును, లోకోపకారమునకును, తమ కుటుంబ నిర్వహణమునకును, ఏ మాత్రం పనికి వచ్చుటలేదని సువ్యక్తమగుచున్నది ఈక రాళ కలికలా ప్రభావమున- పాపమేవం పరిజ్ఞాత్వా తత్పాపం నసమా చరేత్|| తస్మాత్సర్వ ప్రయత్నేన పుణ్యమేవ సమాచరేత్|| ఇతిగౌతమః ఇట్లు మానసిక, వాచిక, కాయిక పాపములను గురువుల బోధవలనను, గురూపదిష్ట శాస్త్ర సంచయము వలనను, లెస్సగా గ్రహించి, అట్టి పాపముల చేయగూడదని విరమించుటయు, తెలియక జేసిన పామములు పారద్రోలుటకై మంత్రపూత జలమార్జనముల చేతను, ప్రాణాయామముల చేతను, నశింపజేసికొనుచు ఎప్పటికప్పుడు పూతుడై మెలంగవలయును కనుక సర్వవిధములచే ప్రయత్నించి, పుణ్యకార్యములను (ధర్మమును) సముపార్జింప వలయును అని గౌతమ మహర్షి తమ ధర్మసూత్రములలో ధర్మసూక్ష్మముల నెన్నింటినో బోధించియుండిరి. వానిని చదువని, వినని, విశ్వాసము లేని దోషము మనది. ''ధర్మార్ధ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ధర్ధ్యం'' అనియును, శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం''అనియును, ''శ్రీమహావిష్ణో రాజ్ఞయా'' అనియును. చేయు సంకల్పములలోని పుణ్యము అనగా ధర్మము, ఆ ధర్మస్వరూపుడగు పరమేశ్వర ప్రీతియు, ప్రధాన ప్రయోజనము అని సంధ్యా ప్రబోధము నునకు బోధించుచున్నది. ధర్మము, న్యాయము, సత్యము దీనినే దైవమనుచున్నారము వానికి సామరూసములు లేవు. శ్లో. త్రివిధోజప యజ్ఞస్స్వాత్తస్య భేదం నిబోధతః| వాచికాఖ్య ఉపాంశుశ్చ మానస స్త్రి విథస్స్మృతః| త్రయాణాం జపయజ్ఞానాం శ్రేయాంత్స్య దుత్త రోత్తర కి|| ఇతినృసింహపురాణ. జపమనునది యొక యజ్ఞము. యజ్ఞమనగా దేవతా ప్రీతికరమగునొకపుణ్యకార్యము. ఇది 1 వాచికము 2 ఉపాంశువు 3 మానసము అని త్రి(మూడు) విధములుగా పేర్కొనబడినది. ఆ మూడు మార్గములలో, వాచికము, ఉపాంశువు అనుజపములకన్న మానస జపము మిగుల శ్రోయోదాయకము, శ్రేష్టతమము అనియు తెలుపబడెను. ఇట్లు సృసింహ పురాణము మనకు బోధించుచున్నయది. శ్లో. మనః కృతంకృతం రామ| నశరీ కృతం కృతం| మనోహిజగతాం కర్తృ| మనోహిపురుషస్స్మృతః || శ్లో. మనసైన కృతంపాపం| నశరీరకృతంకృత | యేనై వాలింగి తాకాంతా| తెనై వాలింగితాసుతాం రామచంద్రా! మనస్సు చేసిన పాపమే ప్రధానమైన పాపము, శరీరముతో చేసిన పాపమంతటి ఘోర పాపము కాదు సుమా! మనస్సే జగత్తునకు ప్రధానకర్త, నవద్వార పురముననున్న పురుషుడు ప్రధానమైన మనస్సే- మనస్సుతో చేసినదే ముఖ్య పాపము. శరీరముతో చేసిన పాపము అంతటి పాపము కాదు. ఎట్లనగా- యే శరీరముతో భార్యను అలింగనము చేసికొను చుండెనో ఆ శరీరము చేతనే పుత్రికయు అలింగనము చేసికొనబడు చున్నది. భార్యనాలింగన మొవర్చుకొనిన సమయమున మనఃప్రవృత్తి కామ పూరితమై యుండును. కుమార్తెను ఆలింగనము చేసి కొనునపుడు వాత్సల్య పూరితమైన మనc ప్రవృత్తి యుండును. కాన మనస్సే ప్రధాన కారణము. కాని శరీరము కాదని దీని మూలమున తెలియు చున్నది గదా! మనస్సే మొదట సంకల్పించును. ఆ పనిని శరీరము 'అమలుపఱచును' శరీరమునకు ప్రేరకమైన మనస్సే పాపమును చేయు చున్నది కాన ఆ మనస్సునదే మొదటి తప్పు అనగా ప్రధాన దోషము. కావున మనస్సు గల మానవుడు ఆ మనస్సునే మొదట నిగ్రహించి మంచి దోషరహితమైన మార్గమున ప్రవర్తింప జేయవలయును. కనుక మనస్సుచే చేయబడిన పాపము వాచిక- కాయిక- పాపములకంటె కడుంగడు గొప్పపాపమని స్పష్టమగుచున్నది గదా! ఇట్లు పురాణ వచనములవలన తెలియచున్నది. మనస్సే మానవుని (జీవుని) బంధమునకు గాని, బంధ విముక్తిగాని హేతువు అని భగవద్గీత శాస్త్రము, మరియు శాట్యాయ నీయోపనిషత్ పలుకుచున్నది. ''మన ఏవమనుష్యాణాం కారణం బంధమోక్షయోః'' అని భగవద్గీతా శాస్త్రము. మనస్సే బంధ మోక్షములకు కారణమని తెలుపును. శ్లో. మానసం మనసైవాయము పంభృ క్తే శుభాశుభం || వాచైన వాక్కృతం కర్మకాయే నైవతు కాయికం|| శ్లో. శరీర జైఃకర్మదోషైః యాతిస్థావరతా తాంనరః| వాచికైః పక్షిమృగతాం మానసై రంత్య జాతితాం|| ఇతిమనుః ఇదంశబ్దవాచ్యుడైన జీవుడు మనస్సుతో చేసిన శుభాశుభ కర్మఫలములను మనస్సు చేతనే అనుభవించుచుండును. వాక్కులతో చేసిన శుభాశుభకర్మ ఫలమువలను వాక్కులతోనే అనుభవించును. కాయముతో చేసిన శుభాశుభకర్మ ఫలమును శరీరముతోనే అనుభవించు చుండును, అనియును, శరీరముచే, చేసిన కర్మదోషముల వలన జీవుడు స్థావరత్వమును అనగా చెట్లుచేమలు గిరులుగ రాయి రప్పగ జన్మించును, వాక్కులతో చేసిన కర్మదోషముల వలన పక్షులుగను, మృగములుగను, జంతువులుగను, జన్మించును. మనస్సుచే చేసిన కర్మదోషములవలన అంతిమ జాతిగ మాల, మాదిగ, బురుడ, మున్నగు జాతులలో జన్మించును అని మనుమహారాజ్ తమ ధర్మశాస్త్రమున వెల్లడించి యుండిరి. ఇచట మనము గమనింపదగిన విషయ మేమనగా- కాయికముగా చేసిన దోషము వలన చెట్లుగా జనించి, వానకు తడియుచును, ఎండకు ఎండుచును, శ్రమచెందియు, మనుష్యులకు, పశువులకు నీడను ఇచ్చుచును, పక్షులకు గూండ్లు కట్టుకొనుటకు అవకాశము నిచ్చియు, నరులకును, పక్షులకును ఫలముల నొసంగుచు ఉపకారమును చేయు చున్నది. వాచిక దోషముల వలన పక్షులుగ జన్మించి, అవ్యక్త మధురముగ కిలకిలా రావముల జేయుచు, కర్ణపేయముగ గాన మొనర్చుచున్నవి. వాచికదోషముచే మృగములుగ జన్మించి, పులిగోళ్లు, పులి చర్మమును విరాగులు తపంబొనర్చుటకును, పులిగోళ్లు రాజకుమారుల ఆభరణములకును, కస్తూరిని కస్తూరి మృగము, చమరీ మృగము రాజులకును, భగవంతునకును వీచుటకు వింజామరలకు తమ పుచ్ఛపు (వాలములను) వెండ్రుకలను ఇచ్చుచును ఉపకారము చేయుచున్నవి, చెట్లు-గిరులు-పక్షలు-మృగములు-కన్నను నికృష్ణ జన్మము మానసిక దోషము వలన కలిగిన మానవ జాతిలో అంత్యజాతి లక్షణములను తెలుపుచున్నది. ఈ జాతి అడవులలో మెలంగుచు, దైవతీర్థ-యాత్రలను చేయు యాత్రికులను దారులు కొట్టుచు బాధింతురేకాని- ఉపకారముచేయు బుద్ధి వారికి జనింపదు సుమా! హింసా కృత్యములను మాత్రమే జేయుచుందురు. వారలకు దానియందే అభిరుచి కలిగియుండును. వారికి కేవలము తామసగుణమే కలిగింయుందురు. ఎంత బోధించినను సత్త్వగుణము కలుగదు గదా! కాన జీవాత్మ పూర్వజన్మ కర్మానుభవమును, ఉత్తర జన్మమున వ్య దనభవమనకు రాతగిన విపయములను, వాసనా రూపమున స్వప్నమున గాంచ వచ్చును. తాను పెద్దల వలన గాని, పురాణ విషయములను గాని వినిన విషయములను, పఠించిన విషయములను, సినీమాలలో చూచిన విషయములను గాని, తాను అనుభవించిన విషయములను గాని, స్వప్నమున గాంచుచుందురు. లోకవాసన, దేహ వాసన, విద్యావాసన, అను వాసనా త్రయముచే స్వప్నమునగాంచిన అనుభవములు వ్యావహారిక సత్యములుగా పొడగట్టినను, పారమార్థిక సత్యములు కావని విశ్వసింపవలయును. ఇదియే స్వప్న రహస్యము, కాన స్వప్నము వలేనే జాగ్రదవస్థాను భవములును సత్యములు కావని దృఢమైన విషయము ఇందు విషయమై ఏ మాత్రము సంశయము వలదు. ఇట్లు విద్యారణ్యస్వామి తెలిపియుండిరి. జననాత్పూర్వమున కాని, మరణాత్పర మందుగాని లేనిదియు, అనగా జనన మరణముల మధ్య (నడిమి) కాలమున నుండెడి, శరీరము స్వప్నతుల్యమైన సంధి వంటిది. జాగ్రదవస్థాత్పూర్వమున గాని, సుషుస్త్య వస్థాత్పరమున గాని లేని స్వప్నావస్థ సంధి వంటిది. అనగా జాగ్రత్సుషుప్తుల మధ్య నడిమి) కాలమున నుండు స్వస్నావస్థ సంధి వంటిది. ఆ సంధి యందు చేయ తగిన ధ్యానము సంధ్యోపాసనా రూపమగు ధ్యానము. ''యావజ్జీవం హోష్యే'' జీవించి యున్నంత కాలము హోమము అగ్నియందు చేయుదునని ప్రమాణము చేయుట శాస్త్రముచే విధింపబడినది. నిద్రలో దుస్స్వప్నములు కలిగినపుడు నిద్దరనుంచి మేల్కాంచి పాదప్రక్షాళన మొనర్చి కన్నులను నీటితో తుడిచి, గండూష (పుక్కిలించి, ఉమిసి) మొనర్చి, శుద్ధజలముతో ఆచమించి, భగవన్నామరూపములను ధ్యానించి మరల నిద్రించిన, ఆ దుస్స్వప్న దోష మపనయించుననిశాస్త్రములు తెలుపును. అట్లే స్వప్న తుల్యమగు సంధిలో చేయతగిన ధ్యానమే సంధ్య. అదియే సంధ్యోపాసనము. అనగా హృదయాకాశమున వెలుంగు సూర్య జ్యోతిని ధ్యానించుచు వెలుపల నున్న ఆకాశమున వెలుంగు సూర్యునకును, హృదయాకాశమున ప్రకాశించు వాదిత్యునకును భేదము లేదని గ్రహించుటయే సంధ్యోపాసము నందలి పరమ రహస్యమై యున్నది. ''అనిత్యాని శరీరాని- విభవోనైన శాశ్వతః'' అని కలదు. శరీరములు ఎంతగా జాగ్రత్తగా రక్షించి పోషించినను, ఎంతగా లోకమునందును, వేదమునందును బాగుగా విమర్శించి, చూచినను, అవి శాశ్వతములుగా, నిలచునవి కావు. కొంత కాలము ఉండి, మఱికొంత కాలమునకు నశించిపోవును. అట్లే మనకున్న సంపదలుగాని, మన మార్జించు ధనము కాని మనకు శాశ్వతముగ నిలచునది కాదు. మన కున్నట్టియు, మనమార్జించు నట్టియు ధనము అంతయు మనది కాదు. అందు కొంతభాగము నిరుపేదలకును, విద్వాంసులకును, పంచిపెట్టు (సత్కరించి) చుండవలయును. దాచిన ధనము దొంగల పాలుగాని, ధరణీశుల పాలుగాని అగుచుండును. కాన ''క ర్తవ్యో ధర్మ సంగ్రహః'' ధర్మమునకై మన సంపదలను వినియోగింప వలయును. ధర్మ- అర్ధ- కామ- మోక్షములనెడి పురుషార్ధముల నార్జించుటకై మనకు శరీరము కార్మానుగుణముగా ప్రాప్తించినది. అందు మొదటిది సంధ్యోపాసము. అది చతుర్విధ పురుషార్ధములకును మూల స్తంభము వంటిది అనగా పునాది రాతి వంటిది- మఱియు, ''శ్వః తిష్ఠతీతి'' శ్వత్ధః=రేపు ఉండునది. న+శ్వత్ధః=అశ్వత్ధ=రేపు నిలచునది కాదు. అట్టి అశ్వత్ధ (రావిచెట్టు) వృక్షమునకు; వేద వృక్షమునకు మూలము (వేరు) వంటిదనియు నెఱుంగ తగును. ఈ అశ్వత్ధము వంటి శరీరము నెరింగి, దాని తత్త్వము నెరిగిన వాడు వేద వేత్త యని గీతా చార్యులు బోధించి యుండిరి. మఱియు శిష్యబుద్ధి వైశద్యమును బట్టిగాని, శిష్యచిత్తవ్యాకులతను బట్టిగాని, మహాగురుదేవుడు అధికారాను గుణ్యముగ, అనగా ఆ శిష్యుని తరగతిని (కక్ష్యను=బుద్ధిబలమును) బట్టి బోధించు చుండును ఆ బోధ కొఱకే ఈ శాస్త్ర సామాగ్రి నంతయును మనకు భగవంతుడు ప్రసాదించెను 1వ తరగతి బాలునకు 5వ తరగతి పాఠముగాని, 6వ తరగతి బాలునకు 10వ తరగతి పాఠమును గాని, లెక్కలును గాని బోధింప యత్నింప వారలకా బోధ, బోధపడదు. కావ్యపాఠమును చదువు విద్యార్థికి బ్రహ్మ సూత్ర వ్యాఖ్యాన పంక్తులను, ఉపనిమద్భాష్య ప్రవచనములును, బోధింపగా ఆ బోధా విద్యార్థులకు అర్థము కాదు. తర్క- వ్యాకరణ శాస్త్రజ్ఞులకు మాత్రమే ప్రస్థానత్రయ భాష్య గ్రంథ ప్రవచనమును చేసిన ఎడల బోధపడును. అనగా అర్థమగుచు, సామాన్యులకు అవగాహనము కాదు. అనగా బుద్ధికి చొరదని భావము. ఇచట యొక రచయిత భావమును వెల్లడించు చుండెను. అది శాస్త్రమునకు విరుద్ధమైన యెడల వదలుడు. అవిరుద్ధమైనచో పరి గ్రహించుడు. రచయితకే సంశయ ముదయించినచో చదువరులకు సందేహము కలుగదా? యని భావింపకుడు (వలదు). 1. స్థూల శరీరాభిమానమున దేహి=జీవుడుశరీర=వ్యష్ఠి గత చైతన్యము విశ్వుడను పేరున జాగ్రదవస్థా స్థితిలో, నేత్ర స్థానమునుండి ప్రకాశించుచు సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు అను నామముతో ప్రకాశించు చుండును. మనస్సు అంతఃకరణములో ఒక చేష్టయగును. 2. సూక్ష్మ శరీరాభిమానియగు జీవుడు తైజసుడను నామంబున స్వప్నావస్థయందు నిలచి కంఠ స్థానమున నిలిచి ప్రకాశించుచు. సంశయాత్మకమైన (అనగా కలలో నేను ఏనుగునెక్కితిని.) ఆ విషయము నిజముగానే అపుడు తలంచితిని; కను తెఱచిన, గజము-ఆరోహణము. ఉత్సవము ఏమియు కాన రాలేదు. ఇది నిజామా ? అనృతమా ? భ్రమయా ? భ్రాంతియా ? అనునది సంశయం ఆ అనుభూతి గల జీవునకు గల, అంతఃకరణ చేష్టమగు చిత్తము చిత్ర్పకాశమంతఃకరణముపై ప్రసరించుటచే (చితఃభావ=) చేతనాశక్తి యొక్క భావము చిత్త్వము అదియే చిత్తము అను పేరున ప్రకాశించుచున్నది. 3. కారణ శరీరాభి మానియగు వ్యష్టిగత చైతన్యమగు జీవుడు ప్రాజ్ఞుడను ఆఖ్చచే సుషుప్తి యందు నిలచి, దహ రాకాశమునందు=హృదయస్థానమున, నిలిచి ప్రకాశించుచు, నిశ్చయాత్మకమైన బుద్ధి ప్రతిబింబ చైతన్యము సాక్షిగా ప్రకాశించు చుండును. చైతన్యము ప్రతిఫలించు బుద్ధియు అంతఃకరణ యొక్క ఒక విధమైన చేష్టయని భావము. ప్ర+జ్ఞ=ప్రకర్షణా తెలిసికొనునది ప్రజ్ఞ. అవియే ప్రాజ్ఞయన బడును. ''సుఖమ స్వాప్స్వం'' ''సుఖముగా నిద్రించితిని'' అనుజ్ఞానము, ''ప్రాజ్ఞత్వము.'' మరియు ''ప్ర+అజ్ఞ='' మిక్కిలి తేలివి లేకుండుట- అనగా ''నకించిద వేదిమం'' ''నాకేమియు తెలియదు'' అనెడి అజ్ఞానము గూడ కలదు. అదియే అవిద్య. అదియే ఉపాధిగా గలది ''ప్రాజ్ఞత్వము'' కాన ప్రాజ్ఞ లక్షణము. అనగా లెస్సగా తెలియుట, తెలియకుండుట; అను లక్షణములు గల అంతఃకరణ చేష్టయే ప్రాజ్ఞ నామమునకు భావము. ''ఇది చీకటి'' అని తెలిసి కొనుటయు నొక తెలివి లక్షణము. ''ఇది వెలుగు'' అని గ్రహించుటయు, నొక తెలివి లక్షణము ''నాకు తెలియును'' అను నదియు ఒక తెలివ లక్షణము. ''నాకేమియు తెలియదు- నేనేమి ఎఱుగను'' అను తెలివియు నొక తెలివి లక్షణము. కాన ''చీకటి వెలుతురు''లను గ్రహించుటయు, ''నాకు తెలుసు. నాకు తెలియదు'' అని తెలిసి కొనుటయు, నొక తెలివి లక్షణమే అని గ్రహించవలెను గాని, ''ఒకడు నాకు తెలియదని, పలికెను'' కాన వాడు తెలివి లేనివాడు అని ఇతరుడు భావింప తగదు. వానిని, ''తెలివి తక్కువవాడు,'' అనినవాడు, నిజమైన తెలివి లేనివాడని భావము. ''నాకు తెలియదు అని తెలిసికొనిన వాని యొక్క తెలివి మిగుల గొప్పదని'' తెలిసి కొనదగినది. 4 తురీయస్థితి. అనగా జాగ్రదవస్థయందు వివేకముతో సుషుప్తి యందలి సుఖాను భవమును పొందుటయని పార మార్ధికమైన భావము. అనగా జాగ్రదవస్థ యందు ''అహం- సుఖం- అస్వాప్యం.'' నేను సుఖముగా నిద్రించితిని, ని స్మరించుట అహంకారము,=అహంతా=అహంకృతీ. ఇదియు నొక అంతఃకరణము యొక్క చేష్టఅయి యున్నది. పరమ సుఖానుభవము సుషుప్తిలో నున్నది. ఆ సుఖ స్మృతిని జాగ్రదవస్థలో స్మరించుటయు, అనుభవించుటయు, అహంకార ధర్మము. కనుక మనస్సు-చిత్తము- బుద్ధి- అహకారము. అను నాలుగు స్థితులను నాలుగు అవస్థలలో అనుభవించుచుండెను. ప్రత్యగాత్మగా నున్న జీవునకు ఆ అనుభవ వాసనా జ్ఞానము కలదు. అది తురీయావస్థయని చెప్పబడును. తురీయాతీతము. మనోలయము అంతఃకరణ రాహిత్యము, సంకల్ప రాహిత్యము, మనో నాశనము. 1. సంకల్ప వికల్పాత్మకమగు మనస్సు 2. సంశయాత్మకమగు చిత్తము, 3. నిశ్చయాత్మకమగు బుద్ధి 4. నేను ఈ మేడను కట్టించితిని. నేను ఈ తోటను వేయించితిని. నేను వీనికి ఎమ్ ఏ. వరకు చదువు చెప్పించితిని. అనెడి అహంను, నేను అనెడి, ధ్వనిని ప్రసారించెడి అహంకారము. ఇట్లు నాలుగు విధములుగా ప్రసరించెడి స్వభావమే అంతఃకరణము. ఇది పరమాత్మ ధ్యానముచే, ఆత్మయందు లయించి, నిర్వికార=నిరంజన=పరమాత్మగా నుండు జీవుడు నిశ్శబ్దముగా నిలచియుండును అదియే పరమ పదమును పొందుట అనగా ఏ విధమైన అంఃకరణ ధర్మములు కానరాక ఆత్మ ప్రకాశ మొక్కటియే ప్రకాశించును. ''నిశ్శబ్దం పరమంపదం'' (నాదబిందు-ధ్యానబిందు-ఉపనిషత్) అని ఉపనిషన్మాత పలుకుచున్నది. ఇదియే తురీయాతీతస్థితి, ఇదియే ప్రాప్యము, ప్రాపణీయము జీవ భ్రాంతి నశించిన కృతార్థత, ఆత్మయే అగుట అని భావము. బ్రహ్మీభూతుడగుట యని భావము. ఇదియే సహజావస్థ (నిజస్థితి) అయ్యా; ఈ ఉదాహరణమును గాంచుడు. ''యద్దృశ్యం తన్నశ్యం'' అని బోధించి, మనకంటికి కాన వచ్చెడి దృశ్యజాలమంతయును నశించునది. అనగా స్థిరమైనది కాదు. శాశ్వతమైనది కాదు. కాన సత్యము కాదు. ఇది స్వప్నవృత్తాంతమువలె వట్టిదని ప్రారంభదశలో మొదట సామాన్యశిష్యునకు బోధింతురు గురువులు. కొంత కాలమైన పిమ్మట ''సర్వం ఖల్విదం బ్రహ్మ'' యని ఈ పరిదృశ్యమావమగు జగమంతయును బ్రహ్మమే అనిపై తరగతి శాస్త్ర పాండితిగల విద్యార్ధికి బోధించెను. అధిష్టాన చైతన్యమగు పర బ్రహ్మమున దే ఈ పరిదృశ్యమానమగు జగత్తు భాసించుచున్నది. రజ్జవునందు సర్పమువలెను, శుక్తియందు రజితమువలెను, ఆకాశమునందు నిలత్వము (నీలి) వలెను, స్థాణువు నందు చోరుని (పురుషుని) వలెను, అధిష్ఠానమైన చైతన్యము నందు జగము భాసించుచున్నది వివేకము, విమర్శ, గురూపదేశము, శాస్త్రప్రమాణము, ఆప్తవాక్యము మున్నగు యధార్ధజ్ఞానము గలిగి, సర్పము, రజతము, నీలిమ, చోరుడు (పురుషుడు) జగత్తుపోయి, రజ్జువు,శుక్తి ఆకసము, స్థాణువు (కఱ్ఱదుంగ-మొద్దు) మాత్రమే మిగిలినట్టు బ్రహ్మమొక్కటియే నిలిచి, సర్వాంతర్యామియై, ప్రకాశించు చుండును. కాన జగత్తంతయును, బ్రహ్మాకారమును తెలిసికొని, గాంచుచుండును. జ్ఞానమయ దృష్టిగల వ్యక్తికి సత్యము వెల్లడి యగును. దృష్టిని జ్ఞానమయ మొనర్చి జగత్తును బ్రహ్మమయముగా గాంచుమనియు, అపుడు సత్యము సాక్షాత్కరించుననియు భావము. బ్రహ్మము సత్యవస్తువు గనుక స్వప్నముగూడ సత్యము అని తోచిన శిష్యాళిక జగత్తంతయును సత్యమగు బ్రహ్మ స్వరూపమే. జగత్తు అను (నామము మరియు రూపము భ్రాంతిని వదలి బ్రహ్మముగ పరికించి తెలిసి కొనుమని గురువు బోధించుచుండును. ఇదియే శిష్యుని అధికారాను గుణ్యమగు బోధనా విధానము. ఒక వేదాంత సద్గురు మహాశయుడు కొన్ని సంత్సరముల నుంచి ప్రస్థానత్రయ భాష్యములను పాఠమును చెప్పి బోధించిన పిమ్మట ఆ శిష్యుడు గురువును గూర్చి ఇట్లు పలికెను. అయ్యా; గురువరేణ్య; తాముఇంత కాలమునుంచి శ్రమించి తత్త్వమును బోధించినను, నామనస్సు నేను పెంచిన దున్నపోతు మీదనే లగ్నమైయున్నది గాని మీరు బోధించిన పరతత్త్వము బోధపడలేదని పలికెను. అంతట సద్గురు పుంగవుడు ఆ శిష్యునకు ''నాయనా! నీలో వ్యాపించియున్న ఆ పరతత్త్వమగు పరబ్రహ్మమే నీవు పెంచినట్టియు, నీవు పాఠ సమయమున చూచుచున్న (తలంచుచున్న) ఆ దున్న పోతునందును అనుస్యూతముగా నుండి ప్రకాశింపుచున్నది. దున్నపోతు అని నీవు తలంచుట (భావించుట) ఆభాస, అధ్యాస, కాని అది నిజముగా బ్రహ్మస్వరూపమే. అనితెలిసి కొని బ్రహ్మమును స్మరించుము. అని బోధించగా దున్నపోతు భావము, ఆకారము, నామము, రూపము శిష్యుని మనస్సునందు తొలగి, బ్రాహ్మభావము ఏర్పడినదని భాష్యములలో బోధింపబడి యున్నది. జగద్భ్రాంతిని వదలి బ్రహ్మభావమున గాంచుటయే యధార్ధతత్త్వమని (తెలిపి బోధించెను) తెలియదగును. కనుక అధికారము లేని శిష్యునకు గురువు తనకు తెలిసిన విషయము నంతయును సంపూర్ణముగ బోధించునెడల, శిష్యుడాబోధను గ్రహింప జాలక, ఉన్మత్తుడు కావచ్చును. లేదా ఆ బోధను తెలిసికొనుట అసాధ్యమని, నిశ్చయించి, పాఠము=చదువును విరమించి, ఉపేక్షింప వచ్చును. లేదా ఎచటికో ఎవరికిని తెలుపకయే పారిపోవచ్చును. తలిదండ్రులు చదువులేకున్నను, కంటి ఎదుటనుండువాడు కదా! ఎందుల కొచ్చిన చదువు! పిల్ల వానిని వెదుక లేక పేపర్లలోను, రేడియోలలోను, ప్రకటించవలసి వచ్చెనని బాధనొందెదరు. విద్యను అపేక్షింపకపోవచ్చును. ఇది సత్యము సుమా! కాన ఒజ్జ విద్యార్థియొక్క బుద్ధిననుసరించి కొలది, కొలదిగ జ్ఞానమును కలుగజేయుచు బోధింప వలయును. భ్రాంతి విషయికమై ఉపేక్షయు, పరమార్ధ విషయిక యగు త త్వచింతమున, అపేక్షయు, సత్యాన్వేషణ తత్పరుల కత్యంతావశ్యకము సామాన్యులకు పాపవిషయికమై ఉపేక్షయు, పుణ్యకార్యముల విషయికమైన అపేక్షయు' అసత్య-అధర్మముల విషయమున ఉపేక్షయు, సత్యధర్మముల విషయమున అపేక్షయు, కలిగియుండ వలయును. పరమార్థ విషయమున ఉపేక్షచేచు; వ్యవహారిక విషయమున అపేక్షయు కలిగి యుండుటయు ఏ మాత్రము తగదు. వ్యవహార విషయమున మునింగి యుండినందున, సత్యవస్తు బోధ (జ్ఞానము) జనింపక యున్నది సుమా! విజ్ఞులు వ్యవహారిక విషయమున ఉపేక్షా భావముతో మెలంగుచు, పరమార్ధ విషయమున అపేక్షా భావముతో చరించుటచే వారు ధన్యతములుగను, కృతకృత్యులుగను, మార్పు చెందుదురు, ఈ విషయములన్నియు బ్రహ్మవిద్యాచార్యులగు శ్రీ ముదిగొండ వేంకటరామ శాస్త్రి గురుపాదుల ముఖ్యోపదేశము వలన శ్రవణ మొనర్చితిని. శ్రవణము చేసిన విషయములను సహృదయ సోదరాళికి విన్నవింప నుత్సహించి దీనిని ప్రటించు చుంటిని. అట్లే మనము వ్యవహారోపేక్షయు, పరమార్ధాపేక్షయు కలిగించు విజ్ఞులగు మన పితృపాదులును, గురువులును, చిన్ననాట అష్టవర్ష ప్రాయముననే ఉపదేశించిన, సంధ్యోపాసనమును చేయుచు, ద్విజత్వమును, కాపాడుకొనుచు, మానవత్వమును రక్షించుకొనుచు, బ్రహ్మభావమునుపొందుట జన్మసార్థకమగునని సంధ్య బోధించుచున్నయది. స్వలాభాపేక్షను పరపీడనమును, పరహింసను, పరిత్యజించి, పరోపకారమొనర్చుటయే పరమ ధర్మము మానవత్వమునకు చిహ్నము. ఆవరణశక్తి- విక్షేపశక్తి యననేమి? 1 మనస్సు 2 చిత్తము 3 బుద్ధి 4 అహంకారము అను చతుర్విధములుగా ఒక్క అంతఃకరణము ఉన్న రీతిగా, ఒకేమాయాశక్తియే 1 ఆవరణము. 2 విక్షేపము అను పేర్లతోనుండె నని తలంపవలయును. 1. ఏక త్రాడును గాని, నీటి ధారను గాని చూచి, దానిని సర్పమని అనుకొనుటయే ''ఆవరణశక్తి'' యనబడును. అనగా త్రాటిమీద సర్పము, మాయాశక్తిచే ఆవరించినది. దానిని చూడగనే ఆపాము మనపైబడి కఱచుననెడి భయము, దాని వలన గడగడ వణకు కలుగు చున్నది. అదియే ''విక్షేపశ క్తి'' యనబడును. 2. ఒక నదిలోనున్న రాతిపై నీటి ప్రవాహము వలన ప్రాచిపట్టినది. ఆ ప్రాచి మీద స్నానార్ధమైపోయిన మన కాలుపెట్టుగనే జారెను. జారీ-జారటముతోడనే మన శరీరము క్రింద పడెను. జారుట ప్రాచి వలన జరిగెను. అది ఆవరణ శక్తి, పడుట విక్షేపశక్తి ఈ రెండును ఒకదాని వెంటనే రెండవది వచ్చును దానికి వ్యవధానమే లేదు. ఈరెండు శక్తులును అవ్యవహితముగా నుండును కాన రెండుగా తోచినను విమర్శింపగా అది మాయాశక్తి ఒక్కటియేయని తలంపవచ్చును. 3. 1 శుక్తి (ముత్యపు చిప్పను)ని చూచి రజతము (వెండి) యనుకొనుట ఆవరణము 2. ఆ వెండిని తీసుకొనుటకై గలుగు త్వరపాటు (ఆతురత) విక్షకము ఇట్లే 1 దుంగను చూచి దొంగ=చోరుడు=పురుషుడు, అని తలచుట ఆవరణమ. 2 ఆ చోరుడు, మనను కొల్లకొట్టునని, తలంపుతో, భీతి చెందుట, విక్షేపము ఇట్లే స్వప్నమున పులిని చూచుట ఆవరణము ఆ పులి మనపైకి దుమికి మనను చంపుననెడి భీతి, విక్షేపము. ఇట్లు ఆవరణ విక్షేపములు ఒకదాని వెంటనే ఒకటి వదలక యుండి మనల (జీవుల)ను బాధించు చుండును. ఈ ఆవరణ విక్షేపములు మాయాశక్తి యగు అజ్ఞానము వలననే= ఆవిద్య చేతనే కలుగుచుండును. మాయాశక్తికి పాదద్వంద్వము కలదు. 1 ప్రకాశపాదము 2 విమర్శపాదము అనునవి. 1 ప్రకాశ పాదము వలన జగద్రూపమున వెలుగు ప్రపంచము కానవచ్చును. 2 విమర్శ పాదము వలన అనగా వివేక=జ్ఞాన మనెడి విమర్శనా శక్తి వలన జగద్రూపమున కానవచ్చు ఆవరణ- విక్షేప- రూపమగు మాయాశక్తి తొలగి-యాధార్థమగు రజ్జువు-శు క్తి, స్థాణు- రూపములు తెలియబడును. అనగా సర్పము- వెండి- చోరుడు- అను భ్రాతియనెడు ఆవరణ విక్షేపములు, నశించునని భావము ప్రపంచ రూపమున ప్రకాశమమును గాంచినచో, యధార్ధమగు స్వప్యరూపమగు బ్రహ్మభావము మరుగు పడును. విమర్శనా పాదమువలన యాదర్ధమగు స్వస్వరూప బ్రహ్మభావము దృఢముగ కానవచ్చినచో, ప్రపంచ రూపమగు ప్రకాశము (మాయాశక్తి) తొలగును. ఇదియే మాయను జయించుట- మాయను జయించినవాడు నన్ను పొందెదరు. ''మామేవయే ప్రపంద్యం తే మాయా మేతాం తరంతితే'' భ.గీ, 7అ. 14శ్లో అను గీతాశ్లోక భావమని ఎరుంగవలయును. ''మాముపేత్యుడు కౌంతేయ పునర్జన్మ సవిద్యతే'' భ.గీ. అ.8- 15శ్లో ''ఆత్మన్యేవచ సంతుష్టస్తస్య కార్యంన విద్యతే'' భ.గీ.అ3- 17శ్లో నన్ను పొందినచో, అనగా నేను అనెడి వస్తువు (పదార్థము)ను తెలిసికొనినచో ఆ జీవునకు పునర్జన్మయుండదు. అట్లు ఆత్మయందనురక్తి కలిగి సంతుష్టుడైనచో, అతడు చేయతగిన పని ఎద్దియు నుండనేరదు. ఇదియే ఆత్మను తెలిసి కొనుటవలన గలుగు ముఖ్య ఫలమని యెరుంగుడు. నాయనలారా! మనము పురాకృత పుణ్యపరిపాక వశమున అనేక వేల యోనులయందు, రాయి, రప్ప, చెట్టు చేమ, గుట్ట, తట్ట, పిట్ట, మృగ, సర్ప, జంతు, మనుష్య, శరీరములయందు జన్మించి, జన్మించి, మరణించి, మరణించి, తుదకెట్లో అలభ్యమాసమగు నుత్తమ మానవత్వమును గడించితిమి. అందునను పురుష జన్మను, విద్వత్తును, విప్రత్వమును గడించి, ఉత్తమ జీవులమైతి మనుటకు గర్వింప తగినది. ఆ మానవత్వమును నిరర్ధకము చేసికొనక, ధన సంపాదనమే ప్రధానమని తలంపక, ధర్మార్ధ కామ మోక్షములనెడి, చదుర్విధ పురుషార్ధము (పుమర్థము) లలో ధర్మమునందు ప్రధాన లక్ష్యముంచి, ధర్మమునకు విరుద్ధము కాని అర్థ కామములను శారీరకముగను, శాస్త్రీయముగను, సాధించి, తురీయ(చతుర్థ) పుమర్థమగు మోక్ష మార్గమునకు తగిన పరమార్థ (తత్త్వ) సముపార్జనమునకు శ్రమించి, సంధ్యాది సర్వ వైదిక సత్కర్మానుష్ఠానములను, శక్తి వంచనము లేకుండు లాగున చేయుచు, కనీసము, ఒక్క సంధ్యా సత్కర్మము నైనను చేయుచు, జన్మసార్థకమును జేయుటయే మన మానవ (వైదికద్విజ) జీవిత ధర్మలక్ష్యమని ముఖ్యముగ గుర్తింపవలయును. జన్మమును పొందుటచే, మరల జన్మింపకుండు లాగునను మరణించుటచే మరల మరణము లేకుండు లాగునను, చేసికొనుటయు, మానవత్వమునకు పరమ(ముఖ్య) ప్రయోజనమని యోఱుంగ వలయనని ఈ సంధ్యా (స్వప్న) ప్రబోధమొనరింపబడు చున్నది. మఱియు ''పరమాత్మ జీవాత్మనో రేకత్వ జ్ఞానేనతయో ర్భేదఏవ విభగ్నః సాసంధ్యా'' ఇతి. జీవాత్మ పరమాత్మల కభేద జ్ఞానముచే, ఆ భేద బుద్ధిభగ్న (అంతరించుటయే మగుటయే సంధిఫల ప్రాప్తి కొఱకే అనగా భేద వినాశమునకును, అభేద ప్రాప్తికిన, సంధ్యోపాసనము చేయబడుచున్నదనియు, పెద్దలు (గురువులు) అందులకే మనకద్దాని నుపదేశించి యుండిరనియు, తలంచుడు. అని పరమ హంసోపనిషత్ బోధించు చున్నది. ఇదియే మానవ జీవిత లక్ష్యము, పరమార్థము అయియున్నది. గద్యము కృష్ణామండల మైలవర గ్రామ నివాసులగు సూరవరపు వెంకటపూర్ణావ ధానులు గారికిని ఏక పుత్రుండును, గోదావరీ మండల నక్రపల్లీ నివాసులు వేదుల వంశ సంభూతులును, లక్ష్మీనారాయణశాస్త్రి యను అచ్చన శాస్త్య పరనామధేయులును, ద్రావిడ విప్రులునగు తర్క వేదాంత పండితులకు ప్రియాంతే నాసియ, ర్యాలి గ్రామ వాస్తవ్యులగు పరోపకార పారీణులగు శ్రీవారణాసిసత్యనారయణశాస్త్రి వేదాంత వైయాకరణ మహో దయులకును, బ్రహ్మ విద్యాచార్య శ్రీ ముదిగొండ వెంకటరామశాస్త్రి పాదులకును, శిష్యపరమాణువగు ప్రధమ కళత్రమగు సర్వలక్ష్మీ సతికి పతియు, ద్వితీయ కళత్రమగు అనుసూయాజ్ఞాన ప్రసూనాంబా సతికి మనోవల్లభాచార్యుడును, దారకాచార్యుడగు ''సంధ్యాశ్రీ'' లక్ష్మీపతిశాస్త్రిచే వ్రాయబడిన స్వప్నతత్త్వ వివేకము అను నీ గ్రంథము పరి సమాప్తము. ఓం తత్ - సత్ - ఇతిశివమ్. సవరణసూచిక పుట పంక్తి తప్పు ఒప్పు 2 20 నేనేమి నేనేమియు 3 19 కేక లేక 6 23 స్వప్న స్వస్వ 8 23 కావే కాలే 9 13-16 మృద్యన్న-అక్ష మృద్వన్న - అక్షి 9 21-22 తోన్న-ముచెడి మున్న-తోచెడి 9 1 4 వదలను వదలును 10 15-24 సుపుడు సుప్తుడు 16 6-18 గాన-బులు గాని-ఖలు 16 18-21 భావ భాన 17 5- రములో రములలో 18 4 సుషుపు సుషుప్తు 19 9 యక్తుల యుక్తుల 21 21 కౌమార్య కౌమార 23 4-5 ముఖస్థ-త త్త. ముఖ్య-త త్త్వ ______________________________________________ ప్రథమ ముద్రణ : 1979 ప్రోగ్రెసివ్ ప్రెస్ - విజయవాడ - 2 హక్కులు రచయితవి : ప్రతులు : 500 వెల -రూ. 4-00 23 18 యత్నించిన యత్నించని 23 20 ఉద్వో ఉద్యో 25 12 యెక్క యొక్క 26 12 గురు గుర్తు 29 11 చెదురు చెదరు 31 1-2 ఆల-పర్తుని. అని-వర్తుల 31 9- కొందుము కొందము 32 23 వచ్చిన చచ్చిన 38 9- యెక్క యొక్క 40 13 పాసి పాస్తి 4 21 పోదుమ పోతిమ 45 15-16-24 చగీ.క్షణ భ.గీ.క్షీణ 49 9- కరంబు వరంబు 52 3- నేవరాని నేమాని 52 15 సాధింపు ఉపాసి పు 52 17 పదవి వదలి 53 23 పరమం పరమా 66 2- 6 సామ-శరీ నామ శరీర 66 18 కృత కృతం 67 17 ముక్తి ముక్తికి 67 21 పంభృక్తే పభుంక్తే 69 9- శోధి బోధి 72 11 ప్రకర్షణా ప్రకర్షగా 77 3-11 ఏక-జారీ ఒక-జారే 80 14 స్వప్న స్వస్వ చందాదారులపట్టిక 1. శ్రీ గుండు వెంకట సుబ్రహ్మణ్యము గారు రేడియే ఇంజనీర్, పబ్లిక్ రిలేషన్ డిపార్టుమెంటు, ఖమ్మం. 80_00 2. శ్రీ తాటి యతిరాజులుగారు మైలవరము. మర్చెంట్. దఫాలవారిగా వస్త్రరూపముగా నొసంగిన విరాళము. 100_00 3 శ్రీ ''అభినవజనక'' యధార్ధక్షత్రియ'' ''వీర స్వర్గనివాసి'' ''కలియుగ అభిమన్య'' ''విదేహరాజా'' బిరుదాంచితులగు దంతులూరి రామ భధ్రరాజుగారు మొసలపల్లి, తూర్పుగోదావరి జిల్లా. 35_00 4. శ్రీ సూరానేని పార్ధసారథిరావుగారు. బి.ఏ. మాజీ జమీందార్. మైలవరము సర్పంచ్, వస్త్రరూపమునను ద్రవ్యరూపమునను నొసంగిన విరాళము 70_00 5. శ్రీ యం. గోవర్ధన్. నిర్మల్‌నివాసి, R.&B. సూపర్ వైజర్ గారు హైదరాబాద్ (ఖైరతాబాద్. ఆనందనగర్ కాలనీ 20_00 6. శ్రీ గూడా సరసింహము పంతులు గారు. తహసీలుదార్. భీమవరము. పశ్చిమగోదావరి జిల్లా (నరసాపురము స్వగ్రామము) 50_00 7 శ్రీ వెంకట్రామ్ కంపెనీ మేనేజరు గారు. విజయవాడ_1. 232_00 8. శ్రీ పొన్నము దశరథ రామయ్య చౌదరీగారు. కుంటముక్కల. 70_00 పై చందా దారులకును, విరాళదాతలకును నా కృతజ్ఞతలు.